డబ్బులున్నాయని మ్యూచువల్ ఫండ్స్‌లో కుమ్మరిస్తున్నారా..? అయితే కొత్త కష్టాలు తప్పవు!

డబ్బులున్నాయని మ్యూచువల్ ఫండ్స్‌లో కుమ్మరిస్తున్నారా..? అయితే కొత్త కష్టాలు తప్పవు!

భారతీయ స్టాక్ మార్కెట్లలోకి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ SIP ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కాసుల వర్షం కురుస్తోంది. ఏప్రిల్ నుంచి జూలై 2026 మధ్య కాలంలోనే ఏకంగా రూ.లక్షా 26వేల కోట్ల భారీ మొత్తాన్ని మదుపర్లు ఎస్ఐపీల ద్వారా ఇన్వెస్ట్ చేశారు. 2019-20లో కేవలం రూ.లక్ష కోట్లుగా ఉన్న ఎస్ఐపీ పెట్టుబడులు.. 2025-26 నాటికి ఏకంగా రూ.3.5 ట్రిలియన్లకు చేరాయి. అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పోలియోల సంఖ్య మార్చి 2020 నాటికి 63 కోట్లుగా ఉంటే.. మార్చి 2026 నాటికి అది ఏకంగా 18.3 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కలు చూస్తుంటే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ ఎస్ఐపీల వైపే పరుగులు పెడుతున్నారని స్పష్టమవుతోంది.

ఈ అసాధారణ వృద్ధిపై ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు వివేక్ కౌల్ సంచలన హెచ్చరిక చేశారు. SIPల విజయమే ఇప్పుడు వాటికి అతిపెద్ద శాపంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల సంపాదన పెరిగే వేగానికంటే.. మార్కెట్లోకి వస్తున్న డబ్బుల ప్రవాహం వేగంగా ఉందని పేర్కొన్నారు. దీనివల్ల స్టాక్ ధరలు విపరీతంగా పెరిగిపోయి.. మార్కెట్ వాల్యూయేషన్లు ఆకాశాన్ని తాకుతున్నాయని హెచ్చరించారు. ఇంత భారీగా నిధులు వస్తుండటంతోనే విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి వెనక్కి తగ్గుతున్నారని కౌల్ విశ్లేషించారు.

గతంలో SIPల ద్వారా అద్భుతమైన రిటర్నులు పొందిన ఇన్వెస్టర్లు.. భవిష్యత్తులోనూ అవే లాభాలు వస్తాయని ఆశించడం పొరపాటని కౌల్ స్పష్టం చేస్తున్నారు. గత దశాబ్ద కాలంలో ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్‌లో 10 ఏళ్ల సగటు వార్షిక రిటర్ను 14.1% ఉండగా, 5 ఏళ్లలో 11.8%, 3 ఏళ్లలో 7.8%గా నమోదైంది. కానీ నాటి మార్కెట్ పరిస్థితులు వేరు. అప్పట్లో స్టాక్ ధరలు తక్కువగా ఉండటంతో తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు మాత్రం మార్కెట్ చాలా పోటీపడి దూసుకుపోతోంది. చిన్నదిగా ఉన్న మ్యూచువల్ ఫండ్ మార్కెట్ నేడు మహాసముద్రంలా మారిపోయింది. దీంతో ఫండ్ మేనేజర్లు భారీ మొత్తాలను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట.

మొత్తానికి మ్యూచువల్ ఫండ్స్‌లో SIP అనేది మార్కెట్ టైమింగ్ లేకుండా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడానికి ఒక అద్భుతమైన మార్గమే అయినప్పటికీ.. గుడ్డిగా గైడెన్స్ నమ్ముకుని ముందుకు వెళ్లడం ప్రమాదకరమని వివేక్ కౌల్ హెచ్చరిస్తున్నారు. AI ప్రెజెంటేషన్లలో చూపించే గత రిటర్నుల మాయాజాలాన్ని చూసి మోసపోకుండా, మారుతున్న మార్కెట్ పరిస్థితులకు తగినట్లుగా పెట్టుబడి వ్యూహాలను మార్చుకోవాలని సూచించారు.