టిబెట్ - నేపాల్ సరిహద్దు ప్రాంతంలోని హిమాలయాల్లో భారీ మంచు కొండ (Glacier) ఒక్కసారిగా విరిగి లోయలోకి పడిపోవడంతో, లెండే ఖోలా, భోటే కోషి నదీ ప్రవావానికి అడ్డుకట్ట పడింది. అలా తాత్కాలికంగా నిలిచిపోయిన నీరు ఒక్కసారిగా భారీ ఒత్తిడితో బద్దలవడంతో.. నీరు, బురద, భారీ రాళ్లతో కూడిన ప్రచండ ప్రవాహం సునామీలా దూసుకొచ్చి తీవ్ర ప్రాణ, ఆస్తినష్టాన్ని సృష్టించింది. ఈక్రమంలో అసలు హిమాలయాల్లో పుట్టిన నదులు మన దేశంలోకి ఎలా వస్తాయి.. ఎందుకు ప్రమాదకరంగా మారుతన్నాయనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
సింధు, బ్రహ్మపుత్ర, గంగ నదులు హిమాలయాల్లో జన్మిస్తాయి. హిమాలయాల ఆవిర్భావం కంటే ముందు ఆ ప్రాంతంలో జన్మించిన నదులు సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్, కోసి. ఇవి పూర్వవర్తిత రకానికి చెందినవి. హిమాలయాల ఆవిర్భావం తర్వాత జన్మించి ప్రవహించే నదులు గంగా, చంబల్, బెట్వా, కెన్. ఇవి అంతర్వర్తిత రకానికి చెందినవి. ద్వీపకల్ప నదులతో పోలిస్తే హిమాలయ నదులు తక్కువ వయస్సు కలిగి ఉంటాయి. ఈ నదులు లోతైన, ఇరుకైన వి ఆకారపు లోయల గుండా ప్రవహిస్తాయి. ఇవి నౌకాయానానికి అనుకూలంగా ఉంటాయి. హిమాలయ నదులు జీవ నదులు.
హిమాలయాల్లో జన్మించి, దక్షిణ దిశగా ప్రవహిస్తూ కలిసే ఉపనదులు
గండక్, గాగ్రా, కాళీ,కోసి ఉత్తర దిశగా ప్రయణిస్తూ కలిసే ఉపనదులు: యమున, చంబల్, బెట్వా, కెన్, సోన్, దామోదర్, ట్రాన్స్, సింధ్.
యమున: యమునోత్రి అనే హిమనీనదం వద్ద బండార్పుంచ్ శిఖరం యమున జన్మస్థలం. ఈ నది మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం తజేవాలా. ఇది అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. ఉత్తరానికి ప్రవహిస్తూ యమునా నదిలో కలిసే నదులు చంబల్, బెట్వా, కెన్.
గండక్: నేపాల్లోని ఎవరెస్టు, ధవళగిరి శిఖరాల మధ్య జన్మించిన గండక్ నది బిహార్ లో గంగా నదిలో కలుస్తుంది. దీనిని నేపాల్లో సాలగ్రామి, బిహార్ లో నారాయణి నది అని పిలుస్తారు.
కోసి: నేపాల్, టిబెట్, సిక్కిం ప్రాంతాల సరిహద్దుల్లో కోసి ప్రాంతం జన్మిస్తుంది. కోసిని బిహార్ దు:ఖదాయని అని అంటారు. ఈ నదిని ప్రారంభంలో సప్తకోసి అని పిలిచేవారు. వాటిలో ముఖ్యమైనవి అరుణ్ కోసి, తుమార్కోసి, సన్కోసి. ఈ మూడు ఉపనదులు బిహార్ లో గంగానదితో కలుస్తాయి. కోసిని సంస్కృతంలో కౌసికి అంటారు.
గాగ్రా: టిబెట్ లోని గుర్లమందాత్ శిఖరం వద్ద జన్మించే గాగ్రా దక్షిణ దిశగా ప్రవహిస్తూ బిహార్ గంగా నదిలో కలిసిపోతుంది. గాగ్రాను నేపాల్లో కర్నాలి అంటారు.
చంబల్: మధ్యప్రదేశ్లోని జనపావో కొండల్లో గల మౌ అనే ప్రదేశంలో చంబల్ నది జన్మిస్తుంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లాలో యమునా నదితో కలిసిపోతుంది.
బెట్వా: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ సమీపంలో గల కైమూర్ కొండల్లో బెట్వా జన్మిస్తుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తూ యమునా నదిలో కలుస్తుంది. దీనిని నేత్రావతి అని కూడా పిలుస్తారు.
బ్రహ్మపుత్ర
టిబెట్లోని షమ్యమ డంగ్ బ్రహ్మపుత్ర నదీ జన్మస్థలం. దీని పొడవు 2900 కి.మీ. భారత్లో పొడవు 880 కి.మీ. అసోంలోని సాదియా మైదానంలో కలిసే ప్రాంతం. బంగ్లాదేశ్ గోవాలుండూ వద్ద పద్మావతితో బ్రహ్మపుత్ర నది కలుస్తుంది. బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ లో నామ్చాబార్వా శిఖరం వద్ద యూ టర్న్ తీసుకొని జిదోలో అనే ప్రదేశం వద్ద ప్రవేశిస్తుంది. ఇక్కడ దీనిలో కలిసే ఉపనదులు దిబాంగ్, లోహిత్. ఈ నది అసోంలోకి సాదియా అనే ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది. అసోంలో ఈ నదిని సైడాంగ్, బ్రహ్మపుత్ర, రెడ్ రివర్ అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది అసోం దు:ఖదాయని అని అంటారు. బంగ్లాదేశ్లోలో జమున నదిగా పిలుస్తారు. పద్మానదిని కలుపుకున్న తర్వాత మేఘన అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది ఏర్పరిచిన దీవి పేరు మాజులీ. ఇది భారత్లో గల పెద్దదైన నదీ ఆధార దీవి. బ్రహ్మపుత్ర నది ఏర్పరిచే డెల్టా సుందర్బన్స్.
ఉపనదులు:
ఉత్తరం: తీస్తా, మానస, గంగాధర్, సుభన్సిరి, ధన్సరి.
దక్షిణాన: దిబ్రు, డిక్కు, దిహాంగ్.
సోన్: మధ్యప్రదేశ్ లోని అమర్కంటక్ పీఠభూమిలో జన్మించే సోన్ నది నర్మదకు వ్యతిరేకంగా మధ్యప్రదేవ్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ పాట్నా వద్ద గంగా నదిలో కలుస్తుంది. దీని ప్రధానమైన ఉపనది రిహాండ్.
దామోదర్: జార్ఖండ్లోని చోటానాగపూర్లోని టోరి అనే ప్రాంతంలో జన్మించే దామోదర్ పశ్చిమబెంగాల్ లోని హుగ్లీనదిలో కలుస్తుంది. దీనిని బెంగాల్ దు:ఖదాయని అని అంటారు. ఉపనదులు బరాకర్, కోనార్.
