జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో... ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆయనకు సంబంధించిన 8 ప్రాంతాల్లో విస్తృత సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో బయటపడ్డ ఆస్తుల చిట్టా చూస్తే అధికారులే ఖంగుతిన్నారు.
ఇప్పటివరకు గుర్తించిన వివరాల ప్రకారం... హైదరాబాద్ బోడుప్పల్‌లో సుమారు రూ.40 లక్షల విలువైన జీ+2 భవనం, కేపీహెచ్‌బీ కాలనీలో రూ.32.81 లక్షల విలువైన ఫ్లాట్, రూ.15.77 లక్షల విలువైన 5 అదనపు ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఏకంగా 3 కార్లు, 2 బైకులు కలిపి సుమారు రూ.40 లక్షల విలువైన వాహనాలు, ఇంట్లో దొరికిన రూ.10.03 లక్షల నగదు, 629 గ్రాముల బంగారు ఆభరణాలు (వీటి విలువ సుమారు రూ.37.23 లక్షలు). ఎల్ఐసీ, మ్యాక్స్ లైఫ్ , పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ రూపంలో లక్షలాది రూపాయలు.3 బ్యాంకు ఖాతాల్లో రూ.71.27 లక్షలు ఉన్నట్లు బయటపడ్డాయి. ఇలా ఇప్పటివరకు రికార్డుల ప్రకారం ఈ అక్రమాస్తుల విలువ రూ.3.06 కోట్లుగా తేల్చారు. అయితే, మార్కెట్ విలువ లెక్కగడితే ఇది రెండింతలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ సోదాల్లో ఆసక్తికర విషయం ఏంటంటే.? ఏడీ జయరాజు డ్రైవర్ ఖాతా నుంచి ఆయన కుమార్తె ఖాతాకు ఏకంగా రూ.24.80 లక్షలు బదిలీ అయినట్లు తేలింది. ఇసుక రవాణా చేసే వ్యక్తుల నుంచి ఆ డ్రైవరే స్వయంగా డబ్బులు సేకరించి జమ చేసినట్లు విచారణలో అంగీకరించాడు. ప్రస్తుతం ఈ లావాదేవీలపై, డ్రైవర్ వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ అధికారులు దర్యాప్తులను మరింత తీవ్రతరం చేశారు. మరిన్ని అనామక ఆస్తులపై వెరిఫికేషన్ కొనసాగుతోంది.
