పెళ్లి బస్సు బోల్తా: డ్రైవర్ చేసిన పనికి తృటిలో తప్పిన భారీ ప్రమాదం.. 20 మందికి గాయాలు!

పెళ్లి  బస్సు బోల్తా: డ్రైవర్ చేసిన పనికి తృటిలో తప్పిన భారీ ప్రమాదం.. 20 మందికి గాయాలు!

కేరళలోని ఎర్నాకులం జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక ప్రైవేట్ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆగస్టు 27న ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కూతట్టుకుళం-పిరవోం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం సమయంలో  బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రమాదానికి కారణం ఏమిటి?
బస్సు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక సిల్వర్ రంగు స్కూటర్ రోడ్ క్రాస్ చేసుకుంటూ  ఒక్కసారిగా ముందుకు వచ్చింది. అదే సమయంలో నేరుగా  వస్తున్న టూరిస్ట్ బస్సు  స్కూటర్‌ను ఢీకొట్టకుండా కాపాడే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా కుడివైపునకు తిప్పి  బ్రేక్ వేశాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్ పంపు  నిర్మాణాన్ని ఢీకొట్టి బోల్తా పడింది.

తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం:
బస్సు బోల్తా పడే సమయంలో అక్కడే పెట్రోల్ పోయించుకోవడానికి ఆగిన ఒక కారును, మరో బైక్‌ తృటిలో తప్పించుకుంది. ఒకవేళ బస్సు పెట్రోల్ పంపును ఢీకొట్టి ఉంటే,  భారీ అగ్నిప్రమాదం జరిగి ఉండేది. అదృష్టవశాత్తూ అలాంటి ప్రమాదం జరగలేదు.

ఎంత మందికి గాయాలయ్యాయి?
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కొంతమంది స్పృహ కోల్పోయారు. అయితే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను కూతట్టుకుళంలోని ఆసుపత్రులకు తరలించారు.  

సోషల్ మీడియాలో విమర్శలు:
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.  కొందరు  సిగ్నల్ ఇవ్వకుండా, అజాగ్రత్తగా బస్సుకు అడ్డంగా స్కూటర్ నడుపుకొచ్చిన వ్యక్తిపై ప్రజలు మండిపడుతున్నారు.  ఇంకొందరు రోడ్డుపై అంత వేగంగా బస్సును నడిపిన డ్రైవర్‌ను  తప్పుబడుతున్నారు. చాల మంది నెటిజన్లు  ఇలాంటి డ్రైవింగ్ రాని వాళ్ల వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.