దేశంలోని 4 ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు బ్రాంచ్‌లను విస్తరిస్తున్నప్పటికీ.. ఉద్యోగుల సంఖ్యను మాత్రం భారీగా తగ్గించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ సంస్థలు 2026 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 13వేల ఉద్యోగాలను కోల్పోయాయి. డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో బ్యాంకింగ్ రంగంలో వస్తున్న ఈ అనూహ్య మార్పులు ఉద్యోగార్థులను, నిపుణులను ఆలోచనలో పడేశాయి.
బ్యాంకుల వారీగా చూస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగుల కోత అత్యధికంగా ఉంది. మార్చి 31, 2026 నాటికి ఈ బ్యాంక్ పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య లక్షా 29వేల 177 నుండి లక్షా 24వేల 029కి పడిపోయింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3వేల343 మందిని, యాక్సిస్ బ్యాంక్ సుమారు 3వేల 100 మందిని, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1269 మందిని తొలగించాయి. అయితే ఇదే సమయంలో ఈ 4 బ్యాంకులు దేశవ్యాప్తంగా వందలాది కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించడం గమనార్హం.
కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేసినప్పటికీ.. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి శాఖకు అంత సిబ్బంది అవసరం పడడం లేదు. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎంల వాడకం భారీగా పెరగడంతో కస్టమర్లు చాలా వరకు లావాదేవీలను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకుంటున్నారు. అకౌంట్ ఓపెన్ చేయడం, పేమెంట్లు చేయడం, లోన్స్ ప్రాసెస్ చేయడం వంటి సాధారణ పనులన్నీ డిజిటల్ పద్ధతిలో లేదంటే సెంట్రల్ టీమ్‌ల ద్వారా ఈజీగా జరిగిపోతున్నాయి.
దీనివల్ల కొత్తగా బ్రాంచ్ తెరిచినా అక్కడ ఎక్కువ మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం బ్రాంచ్‌లను కేవలం కస్టమర్లను ఆకర్షించడానికి, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్‌ను అమ్మటానికి మాత్రమే ఎక్కువగా వాడుతున్నారు. రొటీన్ పనులన్నీ డిజిటల్ సిస్టమ్స్ చూసుకుంటుండడంతో తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ మంది కస్టమర్లకు సేవలు అందించడం బ్యాంక్‌లకు సాధ్యమవుతోంది.
ఈ పరిణామాలు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు పూర్తిగా కరవవుతాయని కాదు.. ఉద్యోగ స్వభావం మారుతుందనేదానికి సంకేతం. సాధారణ ఆపరేషన్స్ పనులు తగ్గినప్పటికీ, కస్టమర్లతో నేరుగా వ్యవహరించే రిలేషన్‌షిప్ మేనేజర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, వెల్త్ అడ్వైజర్ల వంటి స్పెషలైజ్డ్ రోల్స్‌కు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. టెక్నాలజీ పాత్ర పెరుగుతున్న కొద్దీ భవిష్యత్తులో బ్యాంకింగ్ ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారనుందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
