అడ్వాన్స్‌డ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగులకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కొత్త ఔషధాన్ని ఆమోదించింది. అత్యంత ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ చికిత్సలో దశాబ్దాలుగా అసాధ్యంగా ఉన్న ‘అండ్రగ్గబుల్’ కేన్సర్ కారకాలను ఇది లక్ష్యంగా చేసుకుంటుంది. క్యాన్సర్ కణాల వృద్ధిని వేగవంతం చేసే మ్యుటేటెడ్ ప్రోటీన్‌ను సమర్థవంతంగా అడ్డుకునే ‘డారాక్సోన్‌రాసిబ్’ అనే సరికొత్త ట్యాబ్లెట్లకు ఆమోదం లభించింది.
ఈ రోజువారీ మాత్రలను రెవల్యూషన్ మెడిసిన్స్ సంస్థ ‘రాసోంక్’ బ్రాండ్ పేరుతో విక్రయించనుంది. అయితే ఈ ఔషధం ఖర్చు సామాన్యులకు అందనంత భారంగా ఉంది. ఒక నెల మందుల సరఫరా ధర సుమారు రూ.37 లక్షలు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. అత్యంత ఖరీదైనప్పటికీ.. ప్రాణాలను రక్షించుకోవడానికి ఇది రోగులకు ఒక ప్రధాన ఆశాకిరణంగా మారుతోంది.
ఈ ప్రయోగాత్మక ఔషధాన్ని పరీక్షించిన అధ్యయనంలో రోగుల జీవన కాలం దాదాపు రెట్టింపు అయినట్లు తేలింది. ఇంతకుముందు ఇతర చికిత్సలు విఫలమైన 500 మంది మెటాస్టాటిక్ క్యాన్సర్ రోగులపై ఈ పరిశోధన చేపట్టారు. కీమోథెరపీ తీసుకున్న రోగులు సగటున 6.7 నెలలు జీవిస్తే, ఈ కొత్త మందు తీసుకున్న రోగులు ఏకంగా 13.2 నెలల పాటు జీవించారు. చర్మంపై దద్దుర్లు, నోటి పూతలు, విరేచనాలు వంటి కొన్ని జీర్ణ సమస్యలు దుష్ప్రభావాలుగా కనిపించినప్పటికీ.. కీమోథెరపీ కంటే తక్కువ దుష్ప్రభావాలు ఉన్నట్లు వెల్లడైంది.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఇతర అవయవాలకు పాకే వరకు గుర్తించడం కష్టంగా ఉండే అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్. యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతి సంవత్సరం సుమారు 67వేల కొత్త కేసులు నమోదవుతుండగా.. 52వేల మందికి పైగా మరణిస్తున్నారు. దీని 5 ఏళ్ల సర్వైవల్ రేటు కేవలం 13 శాతం మాత్రమే. మాజీ సెనేటర్ బెన్ సాస్ ఈ మందు వాడిన తర్వాత తనకు నొప్పి తగ్గిందని ‘60 మినిట్స్’ కార్యక్రమంలో తెలపడంతో ప్రజాదరణ పెరిగింది.
ఈ మందు తయారీలో ఉపయోగించిన ‘మాల్క్యులర్ గ్లూ’ టెక్నాలజీ భవిష్యత్తులో లంగ్ క్యాన్సర్‌తో పాటు ఇతర రకాల చికిత్సలకు కూడా మార్గం సుగమం చేస్తుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడే దిశగా క్యాన్సర్ వైద్య రంగంలో ఇదొక మైలురాయిగా నిలవనుంది.
