తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, పార్టీ వర్గాల చర్చల మధ్య మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎంకు ఆమె రాఖీ కట్టారు. పార్టీలో వివాదాలు, పీసీసీ నోటీసుల అంశం తర్వాత ఇద్దరు నేతలు మొదటిసారి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ ఏడాదలాగే ఈసారి కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టానని, ఈసారి ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు రాఖీని అలంకరించినట్లు తెలిపారు. మంత్రి సీతక్కతో కలిసి తాను సీఎంకు రాఖీ కట్టినట్లు సురేఖ చెప్పారు. సీఎం రేవంత్‌తో పాటు తన అల్లుడికి, మనవడికి కూడా రాఖీలు కట్టినట్లు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను రాఖీ కట్టడం ఇది మూడోసారని ఆమె గుర్తు చేశారు.
తాను అందరికీ ఆడపడుచునేనని, తనను ఎవరూ వేరు చేసి చూడవద్దని కోరారు. పండగ వాతావరణంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని, ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని సురేఖ స్పష్టం చేశారు.
పార్టీ పరంగా నోటీసులు, అంతర్గత చర్చలు జరుగుతున్న తరుణంలో మంత్రి సురేఖ నేరుగా సీఎంను కలవడం, పండగ వేళ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
