న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే 25 ఏండ్ల వరకు లోక్ సభ స్థానాలను పెంచొద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ప్రస్తుత లోక్‌సభ సీట్ల సంఖ్య 543ను మార్పు లేకుండా కొనసాగించాలన్నారు. 2029 ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ప్రధాని మోదీకి ఖర్గే లేఖ రాశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ ప్రణాళికలపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ జులై 16నే తాను ప్రధానికి లేఖ రాసినట్టు గుర్తుచేశారు. త్వరలో పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరిగే అవకాశం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్రిజుజు ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నందున.. మరో సారి తాను లేఖ రాసినట్టు తెలిపారు.
‘కిరణ్రిజుజు సూచించిన విధంగా మీరు ముందుకు వెళ్లాలనుకుంటే.. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో మీ ప్రతిపాదనలపై చర్చించడానికి వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఆ ప్రతిపాదనలను అధ్యయనం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత సమయం ఇవ్వండి’ అని మరోసారి తన లేఖలో కోరినట్టు ఖర్గే తెలిపారు. ఈ విషయంపై ఈ నెల ప్రారంభంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఈ డిమాండ్లను పునరుద్ఘాటించింది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రధాని కోరడాన్ని ఓ డ్రామాగా అభివర్ణించింది. మోదీ ఏకైక ఎజెండా తనను తాను కాపాడుకోవడమే కానీ, మహిళా రిజర్వేషన్లను కాదని ఆరోపించింది. గతేడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో డీలిమిటేషన్ తో లింక్పెడుతూ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సభలో ఓటింగ్ జరిగినప్పుడు, మూడింట రెండు వంతుల మెజారిటీకి సరిపడా మద్దతు లభించకపోవడంతో ఆ బిల్లు ఆమోదం పొందలేదు. కాగా, నేపాల్‌లో వరదల్లో ప్రాణనష్టం పట్ల ఖర్గే తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
