- ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే: హరీశ్ రావు
- హాస్పిటల్స్‌తో అగ్రిమెంట్ లేకుండా ఈహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ కట్ చేస్తున్నరు
- సమస్యలపై మాట్లాడితే టీఎన్జీవోల నాయకులను బెదిరిస్తున్నరు
- ఉద్యోగ, ఉపాధ్యాయులతో పెట్టుకుంటే రేవంత్‌కు శంకరగిరి మాన్యాలు తప్పవని హెచ్చరిక
హనుమకొండ, వెలుగు: రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు ఉద్యోగుల నుంచి 15 శాతం కమీషన్ అడుగుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. గతంలో సీనియారిటీ ప్రకారం జీపీఎఫ్ లోన్లు రిలీజ్ అయ్యేవని, ఇప్పుడు కమీషన్లు, పర్సంటేజీలు ఇచ్చినోళ్లకే రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్ లోన్లు వస్తున్నాయని మండిపడ్డారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నెట్‌వర్క్ హాస్పిటల్స్‌తో అగ్రిమెంట్ చేసుకోకుండా ఎంప్లాయీస్ హెల్త్ స్కీం కోసం జీతాల నుంచి ఒకటిన్నర శాతం కాంట్రిబ్యూషన్ కట్ చేస్తూ ఉద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈహెచ్‌ఎస్ అమలు చేయలేనప్పుడు 4 నెలలుగా జీతాలు ఎందుకు కట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదేనని విమర్శించారు.
ఉద్యోగుల సమస్యలపై ఎవరైన మాట్లాడితే విజిలెన్స్ ఎంక్వైరీలు, ఏసీబీ, పోలీసుల కేసులతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి శంకరగిరి మాన్యాలు తప్పవని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో 73 శాతం ఫిట్‌మెంట్, ఉద్యమానికి సంబంధించి ఇంక్రిమెంట్లు ఇచ్చామని గుర్తుచేశారు. గతంలో కేసీఆర్ ఇచ్చినదాని కంటే మెరుగైన పీఆర్సీ ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాను ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా వచ్చి కలిసే అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు మంత్రి భట్టిని కలవడానికి అపాయింట్మెంట్ దొరకడం లేదన్నారు. ఓపీఎస్ హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు 18 నెలలుగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులు కూడా చెల్లించలేదని, బీఆర్ఎస్ ప్రశ్నించాక 8 నెలల బకాయిలు మాత్రమే విడుదల చేశారన్నారు.
ఢిల్లీకో నీతి.. తెలంగాణకో నీతా..
‘‘పాలిటెక్నిక్‌లను స్కిల్ యూనివర్సిటీలో కలపవద్దని పోరాడుతున్న విద్యార్థుల గొంతు పిసుకుతున్నరు. వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నరు. ఆ పిల్లలేమైనా టెర్రరిస్టులా.. సంఘ విద్రోహ శక్తులా?’’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఢిల్లీలో జెన్ జీతో కలిసి ఉద్యమాలు చేస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీకో నీతి.. తెలంగాణకో నీతా.. అని నిలదీశారు. ఢిల్లీ తరహాలో విద్యార్థులు తిరగబడక ముందే రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని జీవో 97ను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తారని హెచ్చరించారు. కాగా, హనుమకొండ కలెక్టరేట్ నుంచి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న హరీశ్ రావును పోలీసులు అడ్డుకున్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతల నడుమ హరీశ్ రావుతో పాటు బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హరీశ్ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ కార్యకర్తలు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, పీపీపీ మోడల్‌లో ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీలను విలీనం చేయడం అంటే ప్రైవేటుపరం చేయడమేనన్నారు. ఆయన వెంట జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ మాలోతు కవిత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
