విదేశాల్లో ఉన్న ఓటర్లకు సర్‌‌‌‌‌‌ నోటీసులు

విదేశాల్లో ఉన్న ఓటర్లకు సర్‌‌‌‌‌‌ నోటీసులు
  •     హియరింగ్‌‌‌‌కు ఇంట్లో వాళ్లు వస్తే సరే
  •     ఒరిజినల్స్‌‌‌‌ లేకున్నా సరైన పత్రాల జిరాక్స్‌‌‌‌లు ఇస్తే పరిశీలన 

హైదరాబాద్ సిటీ, వెలుగు: భారత పౌరసత్వం ఉండి విదేశాల్లో ఉంటున్న వారికి ఇక్కడ ఓటు హక్కు కొనసాగుతోంది. ఇలాంటి ఓటర్ల వివరాలను ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌‌‌‌)లో మ్యాపింగ్‌‌‌‌ చేసేందుకు వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఫామ్‌‌‌‌లు అందించారు. అయితే, ఫామ్‌‌‌‌లలో కొన్ని తప్పులు ఉండటంతో ప్రస్తుతం సంబంధిత ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఓటర్ల జాబితాలో గుర్తించిన అనామలీస్‌‌‌‌(స్పష్టమైన గుర్తింపు లేని ఓటర్లు), అన్‌‌‌‌మ్యాపింగ్‌‌‌‌ తదితర అంశాలపై వివరణ ఇచ్చేందుకు ఈ నోటీసులు ఇస్తున్నారు. 

విదేశాల్లో ఉన్న ఓటర్లు వ్యక్తిగతంగా హియరింగ్‌‌‌‌కు హాజరు కాలేని పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులు వారి తరఫున హాజరు కావచ్చని అధికారులు చెబుతున్నారు. అవసరమైన వివరాలు, పత్రాలను సమర్పించి విచారణ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. హియరింగ్‌‌‌‌ సమయంలో ఒరిజినల్‌‌‌‌ పత్రాలు అందుబాటులో లేకపోయినా.. ఓటరు వివరాలను నిర్ధారించే 12 రకాల పత్రాల్లో ఏవైనా సరైన పత్రాల జిరాక్స్‌‌‌‌ కాపీలను సమర్పిస్తే పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే సమర్పించే పత్రాలు సరైనవిగా ఉండటంతో పాటు సంబంధిత ఓటరుకు చెందినవిగా ఉండాలని సూచించారు. హియరింగ్‌‌‌‌లో సమర్పించిన పత్రాలు, ఓటరు వివరాలను పరిశీలించిన తర్వాత ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.