- సబ్సిడీ ద్వారా రేషన్ షాపుల్లో చక్కెరకు పంపిణీ చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ: రాబోయే పండుగ సీజన్లో చక్కెర ధరలు పెరగడం వల్ల బ్లాక్ మార్కెటర్లకు, హోర్డర్లకు లబ్ధి చేకూర్చేలా ప్రధాని మోదీ ప్రభుత్వం ఏకంగా రూ.36,000 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దేశంలో చక్కెర కొరత ఏర్పడుతుందనే విషయం ఏప్రిల్ నెలలోనే కేంద్ర ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఫలితంగా కిలో చక్కెర ధర రూ.40 నుంచి రూ.75కు పెరిగిందన్నారు. ఆగస్టు నుంచి నవంబర్ మధ్య దేశంలో దాదాపు 12 మిలియన్ టన్నుల చక్కెర వినియోగం ఉంటుందని అంచనా వేశారని, ధరల పెరుగుదల వల్ల ప్రజలు కిలోకు అదనంగా రూ.30 చెల్లించాల్సి వస్తోందన్నారు.
ఈ మొత్తం భారం రూ.36 వేల కోట్లకు చేరుతుందని, ఇది నేరుగా బ్లాక్ మార్కెట్కు వెళ్తుందని ఆయన ఆరోపించారు. 2025 నవంబర్ నుంచి 2026 జులై మధ్య కాలంలో దాదాపు 32 శాతం చెరకు నిల్వలను ఈ20 ఇంధన ఉత్పత్తికి మళ్లించారని, ఫలితంగా బహిరంగ మార్కెట్లో చక్కెర లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. దసరా, దీపావళి వంటి పండుగల వేళ ప్రజలపై పడుతున్న ఈ ధరల భారాన్ని తగ్గించాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 500 గ్రాముల చక్కెరను సబ్సిడీ ధరకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
