- పవర్ గ్రిడ్‌లో విదేశీ వస్తువుల వాడకంపై ట్రంప్ బ్యాన్
- సైబర్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకు ముప్పుందంటూ ఆదేశాలు
వాషింగ్టన్: అమెరికా విద్యుత్ గ్రిడ్‌లో విదేశీ పరికరాల వాడకంపై ఆంక్షలు విధిస్తూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విదేశీ పరికరాలతో సైబర్ దాడులు, దేశ భద్రతకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ అవసరాలు పెరుగుతున్న పరిస్థితుల్లో పరికరాల సరఫరా ద్వారా శత్రు దేశాలు యూఎస్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉందన్నారు. రహస్య యాక్సెస్ పాయింట్ల ద్వారా మరో దేశం ఆ పరికరాలను కంట్రోల్ చేయొచ్చన్నారు. కాబట్టి, అమెరికా విద్యుత్ వ్యవస్థలో ఉపయోగించే బల్క్ పవర్ సిస్టమ్ ఎక్విప్‌మెంట్లు, వాటికి సంబంధించిన కీలక సాఫ్ట్‌వేర్, డిజిటల్ టెక్నాలజీలను విదేశాల నుంచి కొనుగోలు చేయడం లేదా ఏర్పాటు చేయడంపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన గురువారం సంతకం చేశారు. ఈ ఆదేశాలు అమలు చేసేందుకు అనుగుణంగా నిబంధనలను రూపొందించాలని ఇంధన శాఖ కార్యదర్శిని ట్రంప్ ఆదేశించారు. ఏ విదేశీ పరికరాలు ప్రమాదకరమో గుర్తించి, వాటిపై తదుపరి చర్యలకు సిఫార్సులు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో, అమెరికా విద్యుత్ వ్యవస్థకు అవసరమైన కీలక పరికరాల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడటం ప్రమాదకరమని ట్రంప్ సర్కారు పేర్కొంది. అమెరికా జాతీయ రక్షణ, అత్యవసర సేవలు, ఆర్థిక వ్యవస్థకు విద్యుత్ గ్రిడ్ కీలకమైనందున దాని భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ట్రంప్ ఉత్తర్వులు అమెరికా బ్లాక్ లిస్ట్‌లో ఉన్న, అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దేశాలకు వర్తిస్తాయని తెలిపింది. కాగా, ఆర్డర్‌లో ఏ దేశం పేరును ట్రంప్ నేరుగా ప్రస్తావించకపోయినా.. చైనా టెక్నాలజీపైనే ఆయనకు అనుమానాలండొచ్చని అమెరికా మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
వీసా హక్కు కాదు..
అవకాశం: ట్రంప్ టీమ్
అమెరికా వీసా.. హక్కు కాదని, ఒక ప్రత్యేక అవకాశం మాత్రమేనని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగట్ స్పష్టం చేశారు. వీసా వ్యవస్థలో మోసం, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. తాత్కాలిక వీసాపై అమెరికాలోకి వచ్చి.. ఆ తర్వాత రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేయడం లేదా శాశ్వత నివాసం పొందేందుకు ప్రయత్నించిన కేసులను పరిశీలిస్తున్నామన్నారు. పర్మనెంట్‌గా అమెరికాలో ఉండాలనే ఉద్దేశంతో వీసా దరఖాస్తు చేసి, ఇంటర్వ్యూలో ఆ ఉద్దేశాన్ని కాన్సులర్ అధికారికి చెప్పకుండా వీసా పొందితే దాన్ని మోసంగా పరిగణించే అవకాశం ఉందని పిగట్ తెలిపారు. అయితే, అమెరికాకు వచ్చిన తర్వాత రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేయడాన్ని మాత్రం మోసంగా పరిగణించబోమని చెప్పారు. కాగా, టూరిజం, బిజినెస్ తదితర తాత్కాలిక వీసాలపై వచ్చి అమెరికాలో పర్మినెంట్‌గా ఉన్న వేలాది మంది విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం సమీక్ష చేపట్టింది.
