నేపాల్‌‌ వరదల్లో ఇద్దరు హైదరాబాద్‌‌ మహిళలు గల్లంతు

నేపాల్‌‌ వరదల్లో ఇద్దరు హైదరాబాద్‌‌ మహిళలు గల్లంతు
  •     ఆచూకీ కోసం ప్రయత్నాలు.. క్షేమంగా తీసుకురావాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి 

పద్మారావునగర్‌‌/ఎల్బీనగర్‌‌, వెలుగు: నేపాల్‌‌లో భారీ వర్షాలు, వరదలతో మానససరోవర్‌‌ యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌‌కు చెందిన ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. సికింద్రాబాద్‌‌ బోయిన్‌‌పల్లికి చెందిన వందనా చంద్‌‌ (49), ఎల్బీనగర్‌‌ వాస్తు కాలనీకి చెందిన కందిమళ్ల సుహాసిని రెడ్డి (27) ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇద్దరినీ క్షేమంగా తీసుకురావాలని ప్రభుత్వాలు, ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. బోయిన్‌‌పల్లికి చెందిన వందనా చంద్‌‌ అమెరికాలోని వర్జీనియాలో ఉంటున్నారు. 

ఇషా ఫౌండేషన్‌‌ సభ్యురాలైన ఆమె ఈ నెల 13న వివిధ దేశాలకు చెందిన 77 మంది బృందంతో ఖాట్మండుకు వెళ్లారు. అక్కడి నుంచి టిబెట్‌‌ సరిహద్దుకు చేరుకున్నారు. బుధవారం ఉదయం చైనా సరిహద్దులోని టిబెట్‌‌ ఎంబసీ వద్ద ఇమిగ్రేషన్‌‌ కోసం వెళ్లిన సమయంలో కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడారు. ఆమె చివరి లొకేషన్‌‌ టిబెట్‌‌-చైనా సరిహద్దులోని జియిరియోంగ్‌‌గా నమోదైంది. అక్క ఆచూకీ కోసం నేపాల్‌‌ వెళ్లేందుకు సిద్ధమైనా.. ఖాట్మండు దాటి రహదారులు దెబ్బతినడంతో వెళ్లలేకపోయామని సోదరుడు సుమిత్‌‌ గుప్తా తెలిపారు.

మానససరోవర్‌‌ యాత్రకు వెళ్లిన సుహాసిని..

ఎల్బీనగర్‌‌ వాస్తు కాలనీకి చెందిన కందిమళ్ల సుహాసిని రెడ్డి (27) కూడా గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌‌వేర్‌‌ ఉద్యోగం చేస్తున్న ఆమె ఈ నెల 19న హైదరాబాద్‌‌కు వచ్చారు. మానససరోవర్‌‌ యాత్ర కోసం ఆదివారం నేపాల్‌‌కు బయలుదేరారు. ఆమె స్నేహితురాలు ఆస్ట్రేలియా నుంచి ఖాట్మండుకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ ఓ పర్యాటక సంస్థ ద్వారా 29 మందితో   యాత్రకు బయలుదేరారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి సుహాసిని ఫోన్‌‌ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇమిగ్రేషన్‌‌ ప్రాంతంలో ఫోన్‌‌ సిగ్నల్‌‌ ఉండకపోవచ్చని ఆమె ముందుగానే చెప్పిందని తండ్రి మహేందర్‌‌ రెడ్డి తెలిపారు. నియంత్రణ కేంద్రాలను సంప్రదించినా సమాచారం అందలేదన్నారు. సుహాసిని ఆచూకీని గుర్తించి సమాచారం ఇవ్వాలని నేపాల్‌‌ అధికారులు, భారత ప్రభుత్వాన్ని కోరారు.