భూపాలపల్లి మైనింగ్ ఏడీ ఆస్తులు రూ.40 కోట్లకుపైనే

భూపాలపల్లి మైనింగ్ ఏడీ ఆస్తులు రూ.40 కోట్లకుపైనే
  •     బొజ్జ జయరాజు ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
  •     అవినీతి సొమ్ముతో హైదరాబాద్​లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తింపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై తెలంగాణ గనులు, భూగర్భ వనరుల శాఖ జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లా అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌(ఏడీ) బొజ్జ జయరాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం వరంగల్‌‌‌‌ గనులు, భూగర్భ వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జయరాజు ఆస్తులకు సంబంధించిన పలు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు. ఆయన డ్రైవర్‌‌‌‌ బ్యాంకు ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు రూ.24.80 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. హైదరాబాద్‌‌‌‌ బోడుప్పల్‌‌‌‌లోని జయరాజు నివాసంతో పాటు కేపీహెచ్‌‌‌‌బీ, కీసర, తుంగతుర్తి, తూప్రాన్‌‌‌‌, సూర్యాపేట, తాండూరు తదితర ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది చోట్ల సోదాలు చేశారు.

బోడుప్పల్‌‌‌‌లో సుమారు రూ.40 లక్షల విలువైన జీ+2 భవనం, కేపీహెచ్‌‌‌‌బీ కాలనీలో రూ.32.81 లక్షల విలువైన ఫ్లాట్‌‌‌‌, ఐదు ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. అలాగే రూ.10 వేల నగదు, ఎల్‌‌‌‌ఐసీ, మ్యాక్స్‌‌‌‌ లైఫ్‌‌‌‌ తదితర పొదుపు పథకాల్లో రూ.19.86 లక్షలు, మూడు బ్యాంకు ఖాతాల్లో రూ.7.12 లక్షల బ్యాలెన్స్​ గుర్తించి ఫ్రీజ్‌‌‌‌ చేశారు. మూడు కార్లు, రెండు బైకులు కలిపి సుమారు రూ.40 లక్షలు, పోస్టాఫీస్‌‌‌‌ పొదుపుల్లో రూ.20.86 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. 629 గ్రాముల బంగారు ఆభరణాల విలువ రూ.37.23 లక్షలుగా, ఇంటి సామగ్రి విలువ రూ.10.67 లక్షలుగా రికార్డుల ప్రకారం ఉంది. సోదాల్లో గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.3.06 కోట్లుగా ఉండగా, ప్రస్తుత మార్కెట్‌‌‌‌ విలువ ప్రకారం వాటి విలువ రూ.40 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్‌‌‌‌ చేస్తే ఏసీబీ టోల్‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌ 1064కు ఫిర్యాదు చేయాలని అదికారులు సూచించారు.

డ్రైవర్‌‌‌‌ ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు..

జయరాజు డ్రైవర్‌‌‌‌ సత్తునూరి యాదయ్య మొబైల్‌‌‌‌ ఫోన్‌‌‌‌లో లభించిన సమాచారం ఆధారంగా అతడి బ్యాంకు ఖాతా నుంచి జయరాజు కుమార్తె ఖాతాకు పలుమార్లు రూ.24.80 లక్షలు బదిలీ అయినట్లు ఏసీబీ గుర్తించింది. ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తుల నుంచి డబ్బులు సేకరించి కుమార్తె ఖాతాకు బదిలీ చేసినట్లు డ్రైవర్‌‌‌‌ అంగీకరించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ డబ్బు ఎవరి నుంచి, ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? అక్రమ లావాదేవీలకు సంబంధించినదేనా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.