చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. కారువానాను ఓడించి గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు!

చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. కారువానాను ఓడించి గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు!

R Praggnanandhaa: సెంట్ లూయిస్ వేదికగా జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో భారత యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫైనల్ మ్యాచ్‌లో అమెరికా దిగ్గజ గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువానాపై అద్భుతమైన పునరాగమనం చేసి, తన తొలి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద రికార్డు పుటల్లోకెక్కాడు. విజేతగా నిలిచిన ఈ 19 ఏళ్ల చెస్ స్టార్‌కి 2,00,000 డాలర్ల (దాదాపు రూ. 1.67 కోట్లు) భారీ ప్రైజ్ మనీ దక్కింది.

6 పాయింట్ల వెనుకబడినా లొంగలేదు.. థ్రిల్లింగ్ ఫినిష్: 

ఫైనల్ మ్యాచ్ ఆఖరి రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి ప్రజ్ఞానంద తన ప్రత్యర్థి కరువానా కంటే 6 పాయింట్ల వెనుకబడి ఉన్నాడు. అంతకుముందు బుధవారం జరిగిన క్లాసికల్ విభాగం మొదటి గేమ్‌లో ప్రజ్ఞానంద 6–0తో ఓడిపోగా, రెండో గేమ్‌ను 3–3తో డ్రా చేసుకున్నాడు. కానీ ఆఖరి రోజున ఊహించని రీతిలో పుంజుకున్న ప్రజ్ఞానంద, రెండు ర్యాపిడ్ గేమ్‌లలోనూ వరుసగా విజయం సాధించి ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు.

ఆ తర్వాత జరిగిన బ్లిట్జ్ విభాగంలోనూ కరువానాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా స్కోరును సమం చేసి, 15–13 తేడాతో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మొదటి బ్లిట్జ్ గేమ్‌లో ప్రజ్ఞానంద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, టైమ్ ఒత్తిడిలో చిన్న పొరపాటు చేయడంతో ఆధిపత్యం కోల్పోయాడు. కానీ కరువానా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఆ గేమ్ డ్రాగా ముగిసింది.

మూడో స్థానంలో వెస్లీ సో మెరుపులు:

మరోవైపు మూడో స్థానం కోసం జరిగిన పోరులో గ్రాండ్ మాస్టర్ వెస్లీ సో, విన్సెంట్ కేమర్‌పై ఘనవిజయం సాధించాడు. ర్యాపిడ్ విభాగంలో వీరిద్దరూ చెరో విజయం సాధించినప్పటికీ, బ్లిట్జ్ విభాగంలో వెస్లీ సో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. వరుసగా నాలుగు బ్లిట్జ్ గేమ్‌లను గెలుచుకుని, ఇంకా ఒక గేమ్ మిగిలి ఉండగానే 18–12 తేడాతో మ్యాచ్‌ను ముగించి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.