- ఆరు నెలల్లో రహదారుల అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
ములుగు, వెలుగు: వెనుకబడిన ములుగు జిల్లాను అభివృద్ధి వెలుగులతో విరాజిల్లేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) సూచించారు. గురువారం ములుగులోని కలెక్టరేట్‌లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఇంజినీరింగ్ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సీతక్క రివ్యూ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి, సంబంధిత ప్రాజెక్టులకు సమగ్ర అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామప్ప– లక్నవరం గ్రావిటీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. దేవాదుల ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను రామప్ప సరస్సుకు తరలించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.
మేడారం జాతర ప్రాంతంలో జంపన్నవాగు సుందరీకరణ పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గోదావరి జలాలు ఈ ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకు తరలిపోతున్నప్పటికీ, స్థానికంగా సాగునీటి సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు రూ.200 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రామప్ప– లక్నవరం అనుసంధాన పనులు, పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం, రామచంద్రాపురం– మల్లంపల్లి ప్రాంతాల్లో కొనసాగుతున్న, చేపట్టబోయే పనుల పురోగతితోపాటు వాటికి అవసరమైన భూసేకరణ ప్రక్రియపై సమీక్షించినట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు సీహెచ్ మహేందర్, సంపత్ రావు, లైబ్రరీ సంస్థ చైర్మన్ రవిచందర్, ఆత్మ కమిటీ డివిజన్ చైర్మన్ రవీందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గోవిందరావుపేట మండలం పస్రాలో బంజారాలతో కలిసి తీజ్ ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.
రాఖీ కట్టి న మంత్రి సీతక్క
రాఖీ పండుగ సోదర, సోదరీమణుల అనురాగాలకు ప్రతీక అని మంత్రి సీతక్క అన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకొని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అడిషనల్ కలెక్టర్లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
