- 20వ గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి నేపథ్యంలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో 20వ గ్రాండ్ నర్సరీ మేళా – ఆలిండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షోను ఆయన ప్రారంభించారు. అనంతరం వివిధ స్టాళ్లను ఆయన పరిశీలించారు. ప్రతి ఏడాది ఆగస్టు, జనవరిలో నర్సరీ మేళా నిర్వహించడం ద్వారా ప్రజలకు వివిధ రకాల మొక్కలు ఒకే వేదికపై అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి తెలిపారు.
రూ.20 నుంచి రూ.2.5 లక్షల వరకు మొక్కలు..
ఆగస్టు 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు నిర్వహించే మేళాలో 110కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, ముంబయి, బెంగళూరు, పుణె, చెన్నై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వివిధ రకాల మొక్కలను తీసుకొచ్చినట్లు ఇన్‌చార్జి ఖాలీద్ అహ్మద్ తెలిపారు. నాగాలాండ్‌కు చెందిన కాక్టస్ వంటి ప్రత్యేక మొక్కలు కూడా ఉన్నాయని, రూ.20 నుంచి రూ.2.5 లక్షల వరకు విలువైన మొక్కలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
