నేపాల్‌ను వణికించిన భారీ వరద విపత్తులో కనీసం 469 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గల్లంతయ్యారు. భోటెకోషి, త్రిశూలి నదీ పరీవాహక ప్రాంతాల్లో సంభవించిన ఈ విలయం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సహాయక చర్యల కోసం అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చినప్పటికీ.. ఇతర దేశాల నుంచి రెస్క్యూ టీమ్స్ పంపాలన్న ప్రతిపాదనలను నేపాల్ ప్రభుత్వం అధికారికంగా తిరస్కరించింది. తమ సొంత భద్రతా బలగాలే ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను సమర్థవంతంగా నిర్వహించగలవని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
భారత్, చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, సౌత్ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి అనేక దేశాలు సహాయం అందించడానికి ముందుకు వచ్చినప్పటికీ నేపాల్ వాటిని రిజెక్ట్ చేసింది. ప్రత్యేకించి వందలాది మంది భారతీయ పౌరులు గల్లంతు కావడంతో.. తమ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF) టీమ్స్ పంపిస్తామని భారత్ కోరింది. చైనా సహా ఇతర దేశాల నుంచి కూడా ఇలాంటి విజ్ఞప్తులే వచ్చాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ రెస్క్యూ టీమ్స్ తమకు అవసరం లేదని, స్థానిక బలగాలే సరిపోతాయని నేపాల్ తేల్చిచెప్పింది.
2015లో సంభవించిన భారీ భూకంపం అనుభవాల దృష్ట్యానే నేపాల్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో విదేశాల నుంచి పెద్ద ఎత్తున సహాయక బృందాలు రావడంతో సమన్వయం, నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అదే తప్పు మళ్లీ రిపీట్ కాకుండా చూసేందుకు.. రెస్క్యూ బాధ్యతలను పూర్తిగా నేపాల్ పోలీసు, సైనిక బలగాలకే అప్పగించారు. ప్రస్తుతం 4వేల340 మందికి పైగా భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై వేలాది మందిని రక్షించారు.
రెస్క్యూ బృందాలను తిరస్కరించినప్పటికీ.. నేపాల్ అంతర్జాతీయ ఆర్థిక సహాయాన్ని, మానవతా సాయాన్ని మాత్రం స్వాగతించింది. విదేశీ సహాయాన్ని ఒకే సింగిల్ మెకానిజం ద్వారా అందించాలని కోరింది. పునరావాస, పునర్నిర్మాణ దశల్లో మాత్రం అంతర్జాతీయ మద్దతు కోరతామని స్పష్టం చేసింది. ఇప్పటికే అమెరికా 5లక్షల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వైద్య సామాగ్రిని పంపింది. విదేశీ పౌరుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఈ విపత్తులో భారత్, అమెరికా, బ్రిటన్, చైనా సహా వివిధ దేశాలకు చెందిన వందలాది మంది విదేశీయులు గల్లంతు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అయినప్పటికీ దేశ సార్వభౌమత్వాన్ని, తమ విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని నమ్ముతూ నేపాల్ స్వయంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. విదేశీ బలగాల ప్రవేశాన్ని సున్నితంగా తిరస్కరించి, కేవలం ఆర్థిక.. మానవతా సాయాన్ని మాత్రమే స్వీకరించడం ద్వారా నేపాల్ ప్రభుత్వం తన స్వయంపాలనా దక్షతను చాటుకుంది.
