పాతబస్తీ వాసులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో అందుబాటులోకి సైదాబాద్‌ స్టీల్ బ్రిడ్జి, మూసారాంబాగ్‌ బ్రిడ్జి

పాతబస్తీ వాసులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో అందుబాటులోకి సైదాబాద్‌ స్టీల్ బ్రిడ్జి, మూసారాంబాగ్‌ బ్రిడ్జి

హైదరాబాద్ సిటీ, వెలుగు: పాతబస్తీ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రానున్నది. చంచల్‌‌‌‌గూడ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంతోష్‌‌‌‌నగర్ వరకు 3.32 కిలోమీటర్ల మేర రూ.620 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. దీంతో మరో వారంలో సీఎం రేవంత్​రెడ్డితో ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే సైదాబాద్, సంతోష్‌‌‌‌నగర్, చంచల్‌‌‌‌గూడ, ఐఎస్‌‌‌‌ సదన్, చంపాపేట్, కంచన్‌‌‌‌బాగ్, మలక్‌‌‌‌పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. ఆరేండ్లుగా భూసేకరణ, కరోనా, నిధుల జాప్యం తదితర కారణాలతో పనులు ఆలస్యమయ్యాయి.  

మూసారాంబాగ్‌‌‌‌ బ్రిడ్జి కూడా..

మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు కూడా పూర్తయ్యాయి. రూ.52 కోట్లతో ఆరు లేన్లుగా 220 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. రెండువైపులా 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే అంబర్‌‌‌‌పేట్‌‌‌‌–మలక్‌‌‌‌పేట్‌‌‌‌, దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్‌‌‌‌ ప్రాంతాల మధ్య రాకపోకలు ఈజీ కానున్నాయి. భారీ వర్షాలు, వరదల టైంలో మూసారాంబాగ్‌‌‌‌ వద్ద ఏర్పడే ఇబ్బందులకు కూడా శాశ్వత పరిష్కారం లభించనున్నది. 2020 వరదల తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదన తెరపైకి వచ్చినా పనులు ఆలస్యమయ్యాయి. 2024లో  తిరిగి ప్రారంభమైన పనులు వేగంగా జరిగాయి. ఈ బ్రిడ్జిని కూడా వారంలోపు సీఎం ప్రారంభించే అవకాశం ఉంది.