Namibia vs South Africa: విండ్‌హోక్ వేదికగా జరిగిన ట్రై-సిరీస్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు నమీబియా ఊహించని షాక్ ఇచ్చింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నమీబియాకు ఓపెనర్లు లౌరెన్ స్టెన్‌క్యాంప్ (29 బంతుల్లో 41), జాన్ ఫ్రైలింక్ (38 బంతుల్లో 60) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 84 పరుగులు జోడించి సఫారీ బౌలర్లపై ఒత్తిడి పెట్టారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బౌలర్లు ప్రినెలాన్ సుబ్రాయన్ (3/32), కెప్టెన్ బ్యోర్న్ ఫోర్టుయిన్ (2/17) పుంజుకోవడంతో నమీబియాను నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులకు పరిమితం చేశారు.
డెవాల్డ్ బ్రెవిస్ పోరాటం వృథా.. సఫారీలకు చేదు అనుభవం:
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ యంగ్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ 50 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసి, మ్యాచ్‌ను గెలిపించేలా కనిపిస్తున్న అతడ్ని 18వ ఓవర్లో రూబెన్ ట్రంపెల్‌మాన్ (3/24) ఔట్ చేయడంతో సౌతాఫ్రికా ఆశలు ఆవిరయ్యాయి. జొనాథన్ స్మిత్ కూడా 3 వికెట్లు తీసుకోవడంతో, ప్రోటీస్ జట్టు 20 ఓవర్లలో 145/9 పరుగులకే పరిమితమై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ప్రత్యక్ష ప్రసారంలో ఆటంకం.. ప్రొటీస్ బోర్డు క్షమాపణలు:
ఈ మ్యాచ్ మధ్యలో ప్రసార సమస్యలు తలెత్తడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మైదానం నుంచి వస్తున్న పిక్చర్ క్వాలిటీ చాలా అధ్వానంగా ఉండటంతో లైవ్ టెలికాస్ట్‌ను నిలిపివేస్తున్నట్లు సూపర్‌స్పోర్ట్ తెలిపింది. దీనిపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పందిస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పింది. 2027 వన్డే ప్రపంచకప్‌కు నమీబియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు ఉమ్మడి ఆతిథ్యం ఇస్తుండటంతో.. ఈ ప్రాంతంలో క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార నాణ్యతను పెంచడం ఎంతో కీలకమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
నమీబియా సరికొత్త రికార్డు:
సౌతాఫ్రికాపై నమీబియాకు ఇది వరుసగా రెండో టీ20 విజయం కావడం విశేషం. గత ఏడాది అక్టోబర్‌లో విండ్‌హోక్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ నమీబియా సౌతాఫ్రికాను ఓడించింది. తమ విజయాలు ఏదో యాదృచ్ఛికంగా వచ్చినవి కావని, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద జట్లతో నిలకడగా పోటీపడగలమని నమీబియా ఈ ప్రదర్శనతో మరోసారి నిరూపించింది. ఫ్రైలింక్, స్టెన్‌క్యాంప్ బ్యాటింగ్‌తో పాటు బౌలర్లు ట్రంపెల్‌మాన్, స్మిత్ అద్భుతంగా రాణించడంతో నమీబియా టీ20 సిరీస్‌లో శుభారంభం చేసింది.
