బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులతో ఉత్తరాంధ్రలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

 ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లోనూ సెప్టెంబర్ 2వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కనిపిస్తుండగా.. ఈరోజు, రేపు మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు వ్యవసాయ పనులు, పంటల సంరక్షణ విషయంలో వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు.