- ఏపీ ప్రాజెక్టులవారీ కేటాయింపులు అడిగితే..
- మనం అడ్వాన్స్‌గా ఆలోచించాలి: సీఎం రేవంత్
- మన ప్రాజెక్టులు ఏంటో కూడా ట్రిబ్యునల్‌కు చెప్పండి
- రాష్ట్ర విభజనతో తెలంగాణ కన్నా ఏపీకే ఎక్కువ లబ్ధి
- పోలవరం ప్రాజెక్టుకు జాతీయ
- హోదాతోపాటు నిధులూ ఇస్తున్రు..
- ఎన్ బ్లాక్ కేటాయింపుల్లో మహారాష్ట్ర,
- కర్నాటకను చేర్చాలని అడగండి
- ఈ అంశాలపై గట్టిగా వాదనలు వినిపించాలని ఆదేశం
- ట్రిబ్యునల్ అంశాలపై ఇరిగేషన్ అధికారులతో సీఎం కీలక రివ్యూ
హైదరాబాద్, వెలుగు: మిగులు జలాల ఆధారంగా ఏపీ ప్రాజెక్టులు కడుతున్నదని, అసలు మిగులు జలాలు మనవే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూరాల నుంచి వదిలిన జలాల్లో.. శ్రీశైలం నుంచి ఏపీ విచ్చలవిడిగా నీటిని తీసుకుపోతున్నదని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నాక.. దిగువకు వచ్చే మిగులు జలాలు తెలంగాణవే కదా అని అన్నారు. శుక్రవారం ఇరిగేషన్ శాఖ అధికారులు, లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో ట్రిబ్యునల్ వాదనలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.
కృష్ణా జలాలపై సుప్రీం కోర్టులో నడుస్తున్న కేసులపై ఆరా తీశారు. సెక్షన్ 3, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిలాంటి అంశాలపై గట్టిగా వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు. మిగులు జలాల విషయంలో ఏపీ నీటిని వాడుకుంటే.. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా వచ్చే అన్ని జలాలకు రాజ్యాంగ హక్కు వచ్చేలా ఎందుకు వాదించడం లేదని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి అడిగినట్టు సమాచారం.
ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలి
ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట వేసేలా కొంచెం అడ్వాన్స్‌గా ఆలోచించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏపీ ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు అడిగితే అందుకు తగ్గట్టే కౌంటర్ ఇవ్వాలని సూచించారు. ప్రాజెక్ట్ వారీ కేటాయింపులకు ఏపీ పట్టుబడితే.. ఎన్ బ్లాక్ కేటాయింపుల విషయంలో కొత్తగా ఎందుకు ఆలోచించడం లేదని సీఎం రేవంత్ అన్నట్టు తెలిసింది.
ఎన్ బ్లాక్, మిగులు జలాల కేటాయింపులకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్నాటకను కూడా కలిపి మళ్లీ కేటాయింపులు చేసేలా ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించాలని సూచించారు. ప్రాజెక్ట్‌వారీగా కేటాయింపుల విషయంలో మనకు ఏ ప్రాజెక్టులు ఉన్నాయో.. వాటి ఆధారంగా ట్రిబ్యునల్ ముందు వాదించాలని చెప్పినట్టు సమాచారం.
ఏపీకే ఎక్కువిస్తున్నరు.. ఎందుకు వాదించరు..?
రాష్ట్ర విభజనతో తెలంగాణ కన్నా ఏపీకే ఎక్కువ లబ్ధి జరుగుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన, హైదరాబాద్ అంశాన్ని ట్రిబ్యునల్‌లో జల వివాదాలకు ఏపీ ముడిపెడుతుండడంపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించినట్టు తెలిసింది. అసలు రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి తెలంగాణకు అందిన సాయం తక్కువేనని ఆయన చెప్పినట్టు సమాచారం. రాజధాని నిర్మాణం కోసం ఏపీకి కేంద్రం ఆర్థిక సాయం అందిస్తున్నది కదా? అని అన్నట్టు తెలిసింది.
అదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు ఆర్థిక సహకారం ఆ రాష్ట్రానికి దండిగా కేంద్రం నుంచి అందుతున్నదని పేర్కొన్నారు. మన ప్రాజెక్టులకు ఏమైనా సాయం చేశారా? అని ప్రశ్నించినట్టు తెలిసింది. అలాంటప్పుడు ట్రిబ్యునల్‌లో ఈ విషయాలను ఎందుకు లేవనెత్తడం లేదని అధికారులను సీఎం రేవంత్ ప్రశ్నించినట్టు సమాచారం.
తుమ్మిడిహెట్టిపై సెక్రటరీ రివ్యూ
సీఎం రేవంత్ రివ్యూ అనంతరం.. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఇరిగేషన్ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 1న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో చర్చించాల్సిన అంశాలపై డిస్కస్ చేశారు. ఒకప్పుడు ముంపు ప్రభావంపైనే మహారాష్ట్ర అడ్డు చెప్పగా.. తాజా అధ్యయనాల్లో ముంపు ప్రభావం తక్కువే అని తేలడంతో దానిపై ఫోకస్ పెట్టాలని చెప్పినట్టు సమాచారం. మహారాష్ట్రలో ముంపు ఎంత వస్తుంది? మునిగే అటవీ భూములు ఎంత? చాప్రల అభయారణ్యం ముంపు తదితర అంశాలపై ఈఎన్సీ, సంబంధిత అధికారులతో సెక్రటరీ చర్చించినట్టు తెలిసింది.
ఎన్ బ్లాక్ అంటే..
బ్రిజేష్ ట్రిబ్యునల్ 2013లో ఉమ్మడి ఏపీకి 75 శాతం డిపెండబిలోటీ ఆధారంగా 811 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించింది. రెండు రాష్ట్రాలకు కలిపి చేసిన ఈ గంపగుత్తు కేటాయింపునే ఎన్ బ్లాక్ అంటారు. ఆ కేటాయింపుల్లో రెండు రాష్ట్రాల వాటా తేల్చాలని మన రాష్ట్రం పట్టుబడుతున్నది. అదే సమయంలో ఏపీ మాత్రం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చెయ్యాలంటున్నది. ఈ విషయంలోనే సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది.
