- సరిచేసి బీఎల్‌ఓకు ధ్రువపత్రాలు అందజేసిన మంత్రి
హుస్నాబాద్, వెలుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎన్నికల అధికారులు నోటీసు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఎల్‌ఓ అధికారులు మంత్రికి ఈ నోటీసును అందజేశారు. ఓటర్ల జాబితాలో మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పేరు తప్పుగా నమోదైన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించారు. చట్టప్రకారం నోటీసును స్వీకరించి, తన తండ్రి పేరును సక్రమంగా సవరించాలని కోరుతూ సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అక్కడే ఉన్న బీఎల్‌ఓకు అందజేశారు.
అధికారులు ఆ పత్రాలను పరిశీలించి వివరాలను సరిచేసే ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల జాబితా పారదర్శకంగా, పక్కాగా ఉండటం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులు ఇంటింటికీ తిరుగుతూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని, తప్పులుంటే సరిదిద్దుతున్నారని చెప్పారు.
ప్రజలంతా తమ ఓటరు వివరాలను సరిచూసుకోవాలని, ఏవైనా తప్పులుంటే తగిన ఆధారాలతో అధికారులను సంప్రదించి సవరించుకోవాలని పిలుపునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తన విషయంలోనూ నిబంధనల ప్రకారమే అధికారులు నోటీసు ఇచ్చారని, తాను ఆధారాలు సమర్పించానని మంత్రి స్పష్టం చేశారు.
