- గడువులోగా మిల్లు నిర్మించకపోవడం, సాగు లక్ష్యాలు చేరకపోవడమే కారణం
- సూర్యాపేట జోన్ రద్దుపై పతంజలి ఫుడ్స్ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్లాలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌కు కేటాయించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ జోన్‌ను రద్దు చేసి మరో సంస్థకు తిరిగి కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్థనీయమేనని హైకోర్టు తేల్చింది. ఒప్పందంలో నిర్దేశించిన గడువులో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయకపోవడం, నిర్దేశిత ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాలను సాధించడంలో విఫలమవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొంది. చీఫ్ జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల డివిజన్ బెంచ్ ఇటీవల పతంజలి ఫుడ్స్ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను డిస్మిస్ చేసింది. 2025 మార్చి 15న సూర్యాపేట ఫ్యాక్టరీ జోన్‌ను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 13, అదే జోన్‌ను నాలుగో ప్రతివాదికి కేటాయిస్తూ జారీ చేసిన జీవో 14తోపాటు తదనంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పతంజలి సంస్థ ఈ అప్పీల్‌ను దాఖలు చేసింది.
ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు మీ బాధ్యత..
2017 మార్చి 15న కుదిరిన రెండో అవగాహన ఒప్పందంలో 24 నెలల్లో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం సంస్థ బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపు, నర్సరీలు, ప్రాసెసింగ్ మిల్లు, రిఫైనరీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వానికి సమాచారాన్ని అందించాల్సి ఉందని పేర్కొంది. నిర్ణీత బాధ్యతలు నెరవేర్చకపోతే ఫ్యాక్టరీ జోన్ రద్దు చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి వచ్చే వరకు రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎఫ్‌ఎఫ్‌బీలను కొనుగోలు చేసి వాటిని ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలించే బాధ్యతను కూడా ఒప్పందం నిర్దేశించిందని వివరించింది.
నల్లగొండ జోన్ కొనసాగించండి..
సూర్యాపేట ఫ్యాక్టరీ జోన్‌లో నిర్దేశించిన సాగు లక్ష్యాల్లో సుమారు 14 శాతం మాత్రమే సాధించగా, నల్లగొండలో సుమారు 36 శాతం పనితీరు నమోదైనందున ఆ జోన్‌ను పతంజలి వద్దే కొనసాగిస్తూ సూర్యాపేట జోన్‌ను మాత్రమే రద్దు చేసినట్లు ధర్మాసనం తెలిపింది. పతంజలి నల్లగొండ ఫ్యాక్టరీ జోన్‌ను కొనసాగిస్తున్నందున అక్కడ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని, సూర్యాపేట జోన్‌ను మరో అర్హత కలిగిన సంస్థకు తిరిగి కేటాయించడం ప్రభుత్వ పథకం లక్ష్యాలకు అనుగుణంగానే ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి 2026 జనవరి 8న తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం, రిట్ అప్పీల్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పింది.
