- కేసు నమోదు చేసిన టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు జీఎస్టీ అకౌంట్లలోకి చొరబడి పాస్‌వర్డ్స్, మొబైల్ నంబర్ సహా మెయిల్ ఐడీలు మార్చేస్తున్నారు. నకిలీ ఈ వే బిల్స్ సృష్టించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) కొట్టేసేందుకు పక్కా ప్రణాళిలు రూపొందించారు. ఇలాంటిదే నల్లగొండ జిల్లా పిట్టంపల్లికి చెందిన సింగిరెడ్డి నిఖిల్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన పన్నాల ప్రతాప్ రెడ్డిలకు చెందిన ‘యుక్తా ఫ్లైవుడ్ అండ్ హార్డ్‌వేర్’అకౌంట్లలోకి చొరబడ్డారు. జీఎస్టీ ఖాతా లాగిన్ వివరాలను మార్చి, రూ.183.62 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లులు సృష్టించారు. బాధితులు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు గురువారం ఫిర్యాదు చేశారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హయత్‌నగర్ లక్ష్మారెడ్డిపల్లి కేంద్రంగా ‘యుక్తా ఫ్లైవుడ్ అండ్ హార్డ్‌వేర్’సంస్థ రిజిస్టర్ అయ్యింది. ఈ కంపెనీ పేరిట జీఎస్టీ అకౌంట్ నిర్వహిస్తున్నారు.
కాగా, ఈనెల 3న సంస్థ అకౌంటెంట్ బండి శ్రీకాంత్ తమ జీఎస్టీ పిన్ ద్వారా జీఎస్టీ పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా, ఎర్రర్ కనిపించింది. దీంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. జులై 23న గుర్తుతెలియని వ్యక్తులు సంస్థకు సంబంధించిన రిజిస్టర్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని, పాస్‌వర్డ్‌ను మార్చినట్లు అకౌంటెంట్ శ్రీకాంత్ గుర్తించాడు. వెంటనే నాగోల్ సర్కిల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌కు సమాచారం అందించి, జీఎస్టీ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఖాతాలోకి ప్రవేశించి 730 నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లులు రూపొందించారని, వాటి విలువ రూ.183.62 కోట్లుగా ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా ఐటీసీ పొందడం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించడమే లక్ష్యంగా ఈ వ్యవహారం సాగినట్లు అనుమానిస్తున్నారు.
