RSS ర్యాలీలో పాల్గొన్న టీచర్స్..సస్పెండ్ చేసిన కర్ణాటక ప్రభుత్వం..

RSS ర్యాలీలో పాల్గొన్న టీచర్స్..సస్పెండ్ చేసిన కర్ణాటక ప్రభుత్వం..

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో RSS ర్యాలీలో పాల్గొన్నారనే ఆరోపణలపై ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ టీచర్లను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. విద్యాశాఖ విచారణ పూర్తయ్యేవరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గవర్నమెంట్ ఎంప్లాయిస్ గా ఉంటూ RSS లాంటి సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనడం సర్వీస్ నియమాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

హూణసగిలోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లో టీచర్ అయిన గురురాజ్ జోషి అక్టోబర్ 12, 2025న విజయపుర జిల్లా తాళికోటలో జరిగిన RSS ర్యాలీలో పాల్గొన్నారని.. అందుకు సంబంధించి ఫోటో విజయ కర్ణాటక పత్రికలో వచ్చిందని ఫిర్యాదు చేశారు అంబేడ్కర్ స్వాభిమాని సేన జిల్లా అధ్యక్షుడు జమ్ముణ్ని గుడిమని. మరో ఉపాద్యాయుడు అన్నాసాహెబ్ దేశ్ ముఖ్ కూడా అక్టోబర్ 10 2025న RSS ర్యాలీలో పాల్గొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గుడిమని ఫిర్యాదు ఆధారంగా 2026 మార్చిలో ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది విద్యాశాఖ. ఈ క్రమంలో ఆ ర్యాలీలు ఆదివారం, స్కూల్ టైమింగ్స్ అయిపోయాక జరిగాయని... పైగా అవి రాజకీయ కార్యక్రమాలు కావని..సాంస్కృతిక కార్యక్రమాలేనని లిఖితపూర్వక వివరణ ఇచ్చారు ఉపాధ్యాయులు. అయితే... విద్యాశాఖ వారి వివరణను తిరస్కరించింది. ముఖ్యంగా యాద్గిర్ జిల్లా పాఠశాల విద్య ఉపసంచాలకులు చెన్నప్ప మూడోల్ వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సమాజానికి ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయాలతో సంబంధం ఉన్న సంస్థల్లో కానీ సభ్యులుగా ఉండకూడదని, వాటి కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొనకూడదని ఉత్తర్వులలో స్పష్టం చేసింది విద్యాశాఖ.