న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సిగ్నేచర్ బ్రిడ్జ్ ఆడిట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిడ్జ్ ఉక్కు తుప్పుపట్టడంతో పాటు సెన్సార్లు దెబ్బ తిన్నట్లు తనిఖీల్లో బయటపడింది. అలాగే, వంతెన పునాది రక్షణ క్షీణత వంటి తీవ్రమైన లోపాలు వెలుగుచూశాయి.
2018లో ఢిల్లీలో ప్రతిష్టా్త్మంగా సిగ్నేచర్ కేబుల్ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఈ వంతెన నిర్వహణ బాధ్యతలను ఇటీవల పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు అప్పగించింది ప్రభుత్వం. ఈ క్రమంలో 2026, జూలైలో బ్రిడ్జి సామర్థ్యం, పని తీరుపై అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టారు. బ్రిడ్జ్ పునాదులు, స్టీల్ డెక్, 154-మీటర్ల పైలాన్, స్టే కేబుల్స్, బేరింగ్‌లు, విస్తరణ కీళ్ళు, అప్రోచ్ నిర్మాణాలు, స్కైవాక్ ర్యాంప్, బ్రిడ్జ్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ (BHMS)తో సహా నిర్మాణంలోని ప్రధాన భాగాలను పరిశీలించారు. ఈ ఆడిట్‌లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
తుప్పు పట్టిన ఉక్కు, దెబ్బతిన్న సెన్సార్లు, పునాదిలోని కొన్ని భాగాల చుట్టూ ఉన్న రక్షణ క్షీణించడం వంటి సమస్యలు బయటపడ్డాయి. వంతెన భద్రతను, రియల్ టైమ్ కదలికలను పర్యవేక్షించాల్సిన బ్రిడ్జ్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ (BHMS) పూర్తిగా నిలిచిపోయినట్లు అధికారులు గుర్తించారు. అనేక సెన్సార్లు దెబ్బతినడం, కనిపించకుండా పోయాయని తెలిపారు. అలాగే, వంతెనపై ఉన్న స్కైవాక్ ర్యాంప్ స్టీల్‌వర్క్, జాయింట్లు, ఫాస్టెనర్‌ల దగ్గర తుప్పు పట్టినట్లు గుర్తించారు. యమునా నది వైపు ఉన్న బ్రిడ్జ్ పునాదుల రక్షణ కాంక్రీట్ నిర్మాణాలు క్షీణించాయి. నీటి ప్రవాహం కారణంగా నదీగర్భంలోని అడుగు భాగాలను పూర్తిగా తనిఖీ చేయలేకపోయారు.
అయితే, వంతెన తక్షణ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో వంతెన పలు లోపాలు బయటపడటంతో ఢిల్లీ ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉష్ణోగ్రత, గాలి వేగం, ట్రాఫిక్ ఒత్తిడి, తుప్పు, వంతెన కదలికలను నిరంతరం ట్రాక్ చేయడానికి అత్యాధునిక సెన్సార్లు, కొత్త కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, తుప్పు పట్టిన ఐరన్‌ను తొలగించడంతో పాటు కాంక్రీట్ పునాదుల దగ్గర పేరుకుపోయిన వ్యర్థాలు, పూడికను తొలగించి వంతెన భద్రతను మెరుగుపరచనున్నారు.
