భారత్‌లో ఫ్యాక్టరీ స్థలాల రేట్లు అధికం.. అందుకే మన కంపెనీలు చిన్న వర్క్‌షాప్‌లుగానే మిగిలిపోతున్నయ్!

భారత్‌లో ఫ్యాక్టరీ స్థలాల రేట్లు అధికం.. అందుకే మన కంపెనీలు చిన్న వర్క్‌షాప్‌లుగానే మిగిలిపోతున్నయ్!

భారతీయ తయారీ రంగం ఎదుర్కొంటున్న అసలు సమస్య సామర్థ్య లేమి కాదని, పరిశ్రమలకు కావాల్సిన స్థలాలు, అనుకూల వాతావరణం కొరవడటమేనని గుజరాత్‌కు చెందిన ‘టైటాన్ అడిటివ్’ వ్యవస్థాపకుడు మాహిర్ పంచాల్ అన్నారు. ఎక్స్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పారిశ్రామిక వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. దేశంలో తయారీ రంగం విస్తరిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. అధికంగా ఉన్న భూముల ధరలు ఫ్యాక్టరీల వృద్ధికి పెద్ద అవరోధంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికాలో తయారీదారులు తమ ఉత్పత్తులను తయారు చేయడానికి సరైన వెండార్లు దొరకట్లేదని ఇబ్బంది పడుతుంటే.. భారతదేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని పంచాల్ పేర్కొన్నారు. తన గేటుకు 40 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న వందలాది చిన్న దుకాణాలు ఏ డిజైన్ ఇచ్చినా క్షణాల్లో తయారు చేసి ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. అయితే చిన్న వర్క్‌షాప్‌లుగా ప్రారంభమైన ఇవి ఎప్పటికీ పెద్ద కంపెనీలుగా ఎదగలేకపోతున్నాయని.. దేశంలో తయారీ సామర్థ్యం ఉంది కానీ.. ఎదగడానికి సరైన ఫ్లోర్ స్పేస్ లేదని చెప్పారు గుజరాతీ వ్యాపారి. 

భారత తయారీ రంగం ఇంకా విదేశీ పరికరాలు, డిజైన్లు, స్టీల్, బ్రాండ్లపైనే విపరీతంగా ఆధారపడుతోందని పంచాల్ ఎత్తిచూపారు. దేశంలో తయారవుతున్న వస్తువుల్లో ఎక్కువ శాతం విదేశీ యంత్రాలపై, విదేశీ ముడిసంచరాతో, విదేశీ బ్రాండ్ల కింద కేవలం చివరి 15 శాతం విలువను జోడించే పనే జరుగుతోందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో లేబర్ కొరత కంటే పారిశ్రామిక భూముల ధరల సమస్యే అత్యంత తీవ్రమైనదని ఆయన స్పష్టం చేశారు.

గుజరాత్‌లోని ఒక టైర్-2 నగరంలోని పారిశ్రామిక వాడడలో గజం స్థలం ధర రూ. 5,000 నుంచి రూ. 7,000 వరకు ఉంటే, అమెరికాలోని డిట్రాయిట్ వెలుపల ఫ్యాక్టరీ భవనం కేవలం రూ. 1,200లకే లభిస్తోందని ఆయన పోల్చి చెప్పారు. అమెరికాలో భూమి, విద్యుత్, కంప్లయన్స్ ఖర్చులు మన దేశం కంటే ఐదో వంతు తక్కువగా ఉన్నాయని తెలిపారు. విపరీతమైన భూముల ధరల కారణంగా తయారీదారులు చిన్న ఫ్యాక్టరీలను నిర్మించాల్సి వస్తోందని, ఇది ఉత్పాదకతను దెబ్బతీస్తోందని అన్నారు. ఒక పారిశ్రామిక ప్లాట్‌ను రియల్ ఎస్టేట్ పెట్టుబడిగా కాకుండా ఉత్పాదకత సాధనంగా చూడాలని, ప్లాట్లు అప్రిషియేట్ అయ్యే ఆస్తులుగా మారితే ఎవరూ వ్యాపారం చేయరని స్పష్టం చేశారు.

జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు కూడా పంచాల్ వాదనతో ఏకీభవించారు. హైవేలు, రైల్వేల వంటి మౌలిక వసతులు అభివృద్ధి చెందిన తర్వాతే పారిశ్రామికాభివృద్ధి జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. భూముల ధరలతో పాటు అధిక వడ్డీ రేట్లు కూడా పరిశ్రమల పెట్టుబడులను వెనక్కిలాగుతున్నాయని, ఈ రెండు సమస్యలను పరిష్కరిస్తేనే భారత్ నిజమైన తయారీ కేంద్రంగా మారుతుందని వేంబు పేర్కొన్నారు.