లక్నో: రాఖీ పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రక్షాబంధన్ వేడుకల్లో తొక్కిసలాట జరిగి ఓ మహిళా మరణించగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాఖీ పండుగను పురస్కరించుకుని గురువారం (ఆగస్ట్ 27) బరేలీ మేయర్, బీజేపీ నేత ఉమేష్ గౌతమ్, ఆయన కుమారుడు పార్థ్ గౌతమ్ బరేలీ క్లబ్ మైదానంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకకు సుమారు 20 వేల మంది మహిళలను ఆహ్వానించారు. వచ్చిన వారికి ఉచితంగా బహుమతులు అందిస్తామని ప్రకటించారు. ఫ్రీగా గిఫ్ట్స్ అనడంతో ఊహించిన దానికంటే ఎక్కువ మంది మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉచిత బహుమతుల కోసం మహిళలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో ఓ మహిళా మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతురాలిని చంద్రగుప్త్ పురం ప్రాంతానికి చెందిన మధుగా గుర్తించారు పోలీసులు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మరణించింది.
ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. నిర్వహణ ఏర్పాట్ల లోపం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
