- సింగరేణి సీఎస్సార్ ఫండ్స్ రూ.8 కోట్లతో ఏర్పాటు
- ఆటోమేటెడ్ మిషన్లతో నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్ తయారీ
- రోజూ 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం సప్లై
- గంటకు 5,600 ఇడ్లీలు, 3 వేల దోశలు, 3,600 పూరీలు
- హరేకృష్ణ మూమెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
- ఈ నెల 31న ప్రారంభం
మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ రెడీ అయ్యింది. కాలేజీ రోడ్‌లోని ఓల్డ్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక యంత్ర పరికరాలతో నిర్మించారు. ఇందుకు సింగరేణి సంస్థ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద రూ.8 కోట్ల ఆర్థిక సాయం అందించింది. సెంట్రలైజ్డ్ ఈ కిచెన్‌కు హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న కిచెన్‌ను ఈ నెల 31న ప్రారంభించనున్నారు.
తయారు చేసి వాహనాల్లో తరలింపు
సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని వివిధ స్కూళ్లు, కాలేజీలకు చెందిన 50 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు. తద్వారా 17 మండలాల్లోని 691 గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న 42,450 మంది విద్యార్థులకు, అలాగే 13 జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 6,654 మంది విద్యార్థులకు ఆకలి తీరనుంది. ఉదయం 4 నుంచి 7 గంటల వరకు బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసి ప్రత్యేక వాహనాల్లో 8 గంటల్లోగా ఆయా స్కూళ్లు, కాలేజీలకు సప్లై చేస్తారు. మూడు నుంచి నాలుగు గంటల పాటు వేడిగా ఉండేలా ప్యాకింగ్ చేసి విద్యార్థులకు అందించనున్నట్లు కిచెన్ నిర్వాహకులు తెలిపారు.
2 గంటల్లో 5 వేల మందికి సరిపడా..
విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్ అందించడంతో పాటు ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో నిర్వహించేందుకు ఫుడ్ ల్యాబ్, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. కిచెన్‌లో అధునాతన ఆటోమేటెడ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఆటోమేటెడ్ స్టీమర్లతో గంటకు 5,600 ఇడ్లీలు, 3 వేల దోశలు, 3,600 పూరీలు తయారవుతాయి. సాంబార్, కూరల తయారీ యూనిట్ల ద్వారా 2 గంటల్లో 5 వేల మందికి సరిపడా రెడీ చేస్తారు. రైస్ కుకింగ్ పరికరాల ద్వారా 15 నిమిషాల్లోనే వెయ్యి మందికి సరిపడా అన్నం తయారు చేయగల సామర్థ్యం ఉంది. అలాగే ఆటోమేటిక్ వెజిటబుల్ వాషింగ్ అండ్ కటింగ్ యూనిట్, ఆర్వో వాటర్ ప్లాంట్, బాయిలర్ ప్లాంట్, సెంట్రల్ గ్యాస్ బ్యాంక్, వ్యర్థ నీటిశుద్ధి ప్లాంట్(ఈటీపీ), వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేసే వ్యవస్థ వంటి పలు ఆధునిక సదుపాయాలను కూడా
ఏర్పాటు చేశారు.
ఇదీ మెనూ..
విద్యార్థులకు సమతుల్యమైన, పోషక విలువలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచనల మేరకు మెనూను రూపొందించారు.
సోమవారం: ఇడ్లీ-సాంబార్
మంగళవారం: పూరీ-ఆలు కుర్మా
బుధవారం: దోశ-చట్నీ
గురువారం: ఉప్మా-చట్నీ
శుక్రవారం: మిల్లెట్ ఇడ్లీ-సాంబార్
శనివారం: బోండా-చట్నీ
కిచెన్ పరిధిలోని 17 మండలాలు
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల, బెల్లంపల్లి, జన్నారం, మందమర్రి, లక్సెట్టిపేట, దండేపల్లి, కాసిపేట, నెన్నెల, హాజీపూర్, నస్పూర్, భీమారం
జగిత్యాల జిల్లా: వెల్గటూరు, ఎండపల్లి
పెద్దపల్లి జిల్లా: రామగుండం, పెద్దపల్లి, అంతర్గాం, పాలకుర్తి
