హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ సంస్థ ఏస్బీఎల్ ‘లెగసీ’ పేరుతో కొత్త రెసిడెన్షియల్ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రకటించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో సుమారు 7.97 ఎకరాలలో దీనిని కడుతున్నారు. మొత్తం 50 అంతస్తులతో మూడు టవర్లు ఉంటాయి. 3,4 బెడ్ రూమ్స్ ఫ్లాట్లు ఉండే ప్రాజెక్ట్‌కు రెరా రిజిస్ట్రేషన్ లభించింది. ధరలు రూ.రెండు కోట్ల నుంచి మొదలవుతాయి. ఈ నెల చివరినాటికి బుకింగ్స్ మొదలవుతాయి.
ఈ గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం 2031 జూన్ నాటికి పూర్తవుతుంది. భూమి కోసం రూ.400 కోట్లు ఖర్చు చేశామని, రాబోయే ఐదేళ్లలో మరో రూ.1,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నామని సంస్థ సీఈఓ అజిత్ తెలిపారు. తమ సంస్థ 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.1,850 కోట్ల నికర అమ్మకాలను సాధించిందని, 2027లో రూ.2,500 కోట్ల సేల్స్‌ను లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. 2031లోపు ఐపీఓకు రావాలని భావిస్తున్నామని అజిత్ ప్రకటించారు.
