బ్రాహ్మణులను అవమానించేలాకవిత మాటలు : బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్

బ్రాహ్మణులను అవమానించేలాకవిత మాటలు :  బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత మాట్లాడిన మాటలు బ్రాహ్మణులను అవమానించేలా ఉన్నాయని రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్  అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను చైర్మన్ గా నియమించడం వెనుక ఎలాంటి ప్రాంతీయ అంశం లేదని, బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం తనకు ఈ బాధ్యతలు అప్పగించిందన్నారు. 

కవిత ఆరోపించినట్లుగా తాను ఆంధ్ర ప్రాంత వ్యక్తిని కాదని, తమ పూర్వీకులది ఖమ్మం అని, తాను మాత్రం నల్గొండ జిల్లా నడిగూడెంలో జన్మించానని చెప్పారు. విద్యాభ్యాసం అంతా తెలంగాణలోనే సాగిందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా బ్రాహ్మణ సమాజం తమ వంతు పాత్రను పోషించిందని ఆయన గుర్తు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలు ప్రతి బ్రాహ్మణుడిని అవమానించేలా ఉన్నాయని, ఈ పరిషత్ ను తాను రాజకీయ వేదికగా కాకుండా బ్రాహ్మణ సంక్షేమం కోసం వినియోగిస్తానని బసవరాజు శ్రీనివాస్  పేర్కొన్నారు.