53 ఐపీఓల్లో 40 హిట్!..లిస్టింగ్ రోజే భారీ లాభాలు

 53 ఐపీఓల్లో 40 హిట్!..లిస్టింగ్ రోజే భారీ లాభాలు
  •     మూడు ఐపీఓల ఇన్వెస్టర్ల పెట్టుబడి డబుల్​
  •     13 పబ్లిక్​ ఇష్యూలతో నష్టాలు

న్యూఢిల్లీ: ఐపీఓ మార్కెట్ ఫుల్ జోష్‌‌‌‌లో ఉంది. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చి పెడుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు  మొత్తం 53 కంపెనీలు మార్కెట్లలో లిస్ట్ అవ్వగా, ఇందులో  40 షేర్లు ఐపీఓ ధర కంటే పైన ట్రేడవుతున్నాయి.  36 స్టాక్స్ అయితే తమ లిస్టింగ్ ధర కంటే పైన ఉన్నాయి. కేవలం  13 షేర్లే  ఐపీఓ ధర కంటే దిగువకు పడిపోయాయి. ఈ కంపెనీలన్నీ కలిసి రూ.67,322.60 కోట్ల నిధులను సమీకరించాయి.

రెట్టింపు లాభాలు ఇచ్చిన స్టాక్స్..

ఓమ్నిటెక్ ఇంజనీరింగ్, సెడెమాక్ మెకాట్రానిక్స్, షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ షేర్లు తమ ఇష్యూ ధర, లిస్టింగ్ ధరలతో పోలిస్తే ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు  చేశాయి (100శాతం పైగా పెరిగాయి). వీటిలో ఓమ్నిటెక్, షాడోఫ్యాక్స్ నష్టాల్లో  లిస్టయినప్పటికీ, ఆ తర్వాత పుంజుకున్నాయి. ఈవీ టెక్నాలజీ, ఆటోమేషన్ విడిభాగాలు, క్విక్-కామర్స్ లాజిస్టిక్స్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాల్లో ఉండటం వీటికి కలిసొచ్చింది. పెద్ద కంపెనీల్లో మణిపాల్ హెల్త్ ఎంటర్‌‌ప్రైజెస్ షేర్లు  ఇష్యూ ధర రూ.590 కంటే 30శాతం లాభాల్లో ఉంది. ఇండో-–ఎంఐఎం  ఇష్యూ ధర కంటే 83శాతం పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది.  ధూత్ ట్రాన్స్‌‌మిషన్ 74శాతం, క్లీన్ మ్యాక్స్ 17శాతం లాభపడ్డాయి.

నష్టాల్లో పెద్ద ఐపీఓలు

ఎస్‌‌బీఐ ఫండ్స్ మేనేజ్‌‌మెంట్ ఐపీఓ ధర కంటే దాదాపు 5శాతం నష్టాల్లో ట్రేడవుతోంది. హొరైజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ (-8శాతం లాస్‌‌), ఫ్రాక్టల్ అనలిటిక్స్ (-7.5శాతం), లీప్ ఇండియా (-1శాతం) నిరాశపరిచాయి. శ్రీరామ్ ట్విటెక్స్ 64శాతం, ఇన్నోవిజన్ (-50శాతం), ఆల్పైన్ టెక్స్‌‌వరల్డ్ (-47శాతం), ఆస్థా స్పిన్‌‌టెక్స్ (-46శాతం) భారీగా పడ్డాయి.

వచ్చే నెల 1న దీపా జ్యువెలర్స్ ఐపీఓ 

దీపా జ్యువెలర్స్ సంస్థ తన ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌‌ను  రూ.168– రూ.177 గా  ప్రకటించింది. ఈ పబ్లిక్ ఇష్యూ వచ్చే నెల 1–3 తేదీల్లో ఉంటుంది. దీని ద్వారా రూ.460 కోట్లను సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రూ.250 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.  2016లో ఏర్పడ్డ ఈ సంస్థ తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తోంది.