మన రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో సాంకేతిక విద్యపై సుదీర్ఘ అనుభవం ఉన్న నిపుణుడిగా నా అభిప్రాయాలు తెలియజేస్తున్నాను. సాంకేతిక విద్యాశాఖతో, ముఖ్యంగా పాలిటెక్నిక్‌లలోని పేద కుటుంబాల విద్యార్థులతో, సాంకేతిక అధ్యాపకులు, సిబ్బందితో నాకు లోతైన అవగాహన ఉంది. వారితో నాకు ఉన్న భావోద్వేగ అనుబంధం వల్ల నా ఆలోచనలను పంచుకుంటున్నాను. రాష్ట్రంలో 128 పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. వీటిలో ఏటా 30వేల మంది విద్యార్థులు చేరుతున్నారు. వీరిలో ఎక్కువమంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులే ఉంటున్నారు. అందులోనూ చాలామంది తెలుగు మీడియంలో చదువుకున్నవారు. వీరంతా లక్షల రూపాయలు ఫీజులు కట్టి కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ చదవలేక పాలిటెక్నిక్ విద్యను ఎంచుకుంటున్నారు.
దీంతో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేస్తే వెంటనే కొలువు దొరుకుతుందని ఈ విద్యార్థులు, వారి కుటుంబాలు ఆశపడుతున్నారు. లేదంటే ఈసెట్ ద్వారా లేటరల్ ఎంట్రీలో భాగంగా ఇంజినీరింగ్ లో చేరి వారి కలలను సాకారం చేసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ పాలిటెక్నిక్‌లో చేరుతున్నవారిలో సగం మంది మాత్రమే తర్వాత ఇంజినీరింగ్‌లో చేరి కొలువులకు అవకాశాలు పెంచుకుంటున్నారు. అయితే మరో సగం మంది మారుతున్న అవసరాలకు తగిన నైపుణ్యాలు లేక, అవకాశాలు రాక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
జీవో 97పై విద్యార్థులు, సిబ్బందిలో సందేహాలు
నేటి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించాలంటే పరిశ్రమలతో విద్యార్థులను అనుసంధానం చేయాలని ఏఐసీటీఈ, ఎస్‌బీటీఈటీ నిర్దేశించాయి. ఇది కచ్చితంగా అవసరమనే విషయంలో సందేహం లేదు. నిజానికి ఈ పనిని ప్రిన్సిపల్ సెక్రటరీ, సంబంధిత మంత్రిత్వశాఖ లేదా ప్రభుత్వం ఎప్పుడో ప్రణాళిక చేసి ఉండాల్సింది. ఇప్పుడు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సంఘాలు, ఎస్‌బీటీఈటీ, ఏఐసీటీఈలతో పాటు అనుభవజ్ఞులైన ప్రస్తుత, పదవీ విరమణ చేసిన సీనియర్ అధికారులు సహా సంబంధిత భాగస్వాములను సంప్రదించకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా జీవో 97ను తీసుకొచ్చింది. ఏఐసీటీఈ పరిధిలోని సాంకేతిక విద్య అయిన పాలిటెక్నిక్ లను ఉపాధి, శిక్షణ విభాగంలో విలీనంతో పాటు పీపీపీ విధానంలో పనిచేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఈ జీవో 97 విద్యార్థులు, సిబ్బందిలో అనేక సందేహాలకు ఆస్కారం ఇచ్చింది. ఏఐసీటీఈ నిర్దేశించిన
3 సంవత్సరాల ఇంజినీరింగ్ డిప్లొమా విద్య, విద్యా ప్రమాణాలు, ఈ సెట్ ద్వారా ఇంజినీరింగ్ కోర్సులలోకి లేటరల్ ఎంట్రీ ఏమవుతాయన్న ప్రశ్నలు తలెత్తాయి. పేద కుటుంబ విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న డిప్లొమా విద్య కొనసాగుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి.
నిపుణుల కమిటీ సిఫార్సులు చేయాలి
మరోవైపు ఏఐసిటిఇ నిర్దేశించిన సాంకేతిక అధ్యాపకులు, కిందిస్థాయి టెక్నీషియన్ల పోస్టింగ్‌లు, ప్రమోషన్‌లు, పదవీ విరమణ ప్రయోజనాలు మొదలైన వారి సర్వీస్ రూల్స్ మాటేంటన్న ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు తక్కువ ప్రమాణాలతో కూడిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలతో పోలిస్తే పాలిటెక్నిక్ కళాశాలలు తమ విద్యార్థులకు మెరుగైన ప్రాక్టికల్ నైపుణ్యాలు నేర్పిస్తున్నాయి. అలాంటప్పుడు ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఇప్పుడు చెబుతున్న శక్తి విభాగం కిందికి ఎందుకు తీసుకురావట్లేదన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు అధ్యాపక, ఇతర సిబ్బందికి కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకయేతర సిబ్బంది సంఘాలు, ఏఐసిటిఇ, ఎస్‌బిటిఇటి, సాంకేతిక నిపుణులు, స్కిల్ యూనివర్సిటీ, ఉపాధి & శిక్షణ శాఖ ప్రతినిధులు వంటి భాగస్వాములతో కూడిన కమిటీ ద్వారా అందరితో చర్చించాలని కోరుతున్నాను. ఈ కమిటీ కనీసం రెండు వారాల నుంచి నెలరోజుల పాటు అందరితో చర్చించి ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయాలి. అప్పటివరకు జీవో 97ను నిలిపివేయాల్సిన అవసరం ఉంది.
- డా. ఎం.వి.రెడ్డి, ఐఏఎస్ (రిటైర్డ్)
మాజీ డైరెక్టర్/ కమిషనర్
సాంకేతిక విద్యాశాఖ
తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
