వెలుగు ఓపెన్ పేజీ : విద్యుత్  రంగానికి ఆర్థిక సవాళ్లు

వెలుగు ఓపెన్ పేజీ : విద్యుత్  రంగానికి ఆర్థిక సవాళ్లు

దేశం తన స్థూల ఆదాయాన్ని పెంచుకొని ప్రపంచ దేశాలతో  పోటీపడాలంటే ఇంధనం కీలకం.  రవాణా, పరిశ్రమల రంగాల్లో చమురు ప్రధాన పాత్ర  పోషిస్తుండగా,  గృహ, వ్యవసాయ, తయారీ, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్‌‌‌‌ శక్తి కీలకంగా మారింది. దేశ ఆర్థికాభివృద్ధిలో  విద్యుత్‌‌‌‌ రంగం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.  విద్యుత్‌‌‌‌ వినియోగంలో  చైనా, అమెరికా తర్వాత భారత్‌‌‌‌  ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది.  2018లో  దేశంలోని చివరి గ్రామానికి  కూడా  విద్యుత్‌‌‌‌ను  అందుబాటులోకి  తీసుకురావడం  ద్వారా 100 శాతం గ్రామీణ విద్యుదీకరణ సాధించిన దేశంగా భారత్‌‌‌‌ ఘనత సాధించింది. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు దేశంలోని నలుమూలలా ప్రతి వినియోగదారుడికి విద్యుత్‌‌‌‌ను పంపిణీ చేస్తున్న డిస్కంలు మాత్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి.  దేశంలోని డిస్కంల మొత్తం అప్పులు సుమారు రూ.7.26 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 


దాదాపు అన్ని ప్రభుత్వ విద్యుత్‌‌‌‌ పంపిణీ  సంస్థలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి.  ఇంధనశాఖ  ప్రకటించిన 14వ సమీకృత రేటింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ ర్యాంకింగ్‌‌‌‌ నివేదిక ప్రకారం దేశంలోని విద్యుత్‌‌‌‌ పంపిణీ సంస్థల అప్పుల్లో తమిళనాడు రాష్ట్రం రూ.1,01,782 కోట్లతో  మొదటి స్థానంలో ఉంది.  ఆ తరువాత  రూ.98,488 కోట్ల అప్పులతో రాజస్థాన్‌‌‌‌  రెండో స్థానంలో, రూ.90,659 కోట్లతో మహారాష్ట్ర  మూడోస్థానంలో నిలిచాయి.  ఆంధ్రప్రదేశ్‌‌‌‌  రూ.77,583 కోట్ల అప్పులతో  నాలుగో స్థానంలో ఉండగా,  ఉత్తరప్రదేశ్‌‌‌‌ రూ.61,395 కోట్లతో  ఐదో స్థానంలో,  తెలంగాణ రూ.59,230  కోట్ల అప్పులతో ఆరోస్థానంలో ఉంది.  పంపిణీ సంస్థల ఆర్థికస్థితికి కారణమయ్యే అంశాలలో  విద్యుత్‌‌‌‌ను ఎంత సమర్థవంతంగా  పంపిణీ  చేస్తున్నారు,  ఎంత ధరకు విక్రయిస్తున్నారు, ఎంత వసూలు చేస్తున్నారు,  సబ్సిడీ  ఎంత  సమయానికి వస్తోంది,  విద్యుత్ శక్తి అమ్మకపు ఖర్చు ఎంత ఉంది.  చౌకగా లభించే  జల,  సౌర,  పవన విద్యుత్ వాడకం.  సాంకేతిక నష్టాలను తగ్గించడం,  టారిఫ్  సవరణలు,  ప్రభుత్వ  సహకారం ఇవే పంపిణీ సంస్థ ఆర్థికస్థితిని నిర్ణయించే ప్రధాన అంశాలు. 

విద్యుత్ అమ్మకమే సంస్థల ప్రధాన ఆదాయ వనరు

వాస్తవానికి రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా రూపాయి విలువలో క్రమంగా క్షీణత చోటుచేసుకుంటోంది. ఈ రోజు ఉన్న రూపాయి విలువ రేపు అదేస్థాయిలో ఉండదు. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదేవిధంగా  ప్రభుత్వరంగ సంస్థలు కూడా పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, మౌలిక వసతుల విస్తరణ, ఉద్యోగుల వేతనాలు తదితర ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యుత్‌‌‌‌ ప్రభుత్వ రంగ సంస్థలను  పరిశీలిస్తే.. ఒకవైపు ఉద్యోగుల కరువు భత్యం (డీఏ),  వార్షిక ఇంక్రిమెంట్‌‌‌‌, అలాగే నిర్దిష్ట కాల వ్యవధిలో వేతన సవరణలు.  మరోవైపు విద్యుత్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త విద్యుత్‌‌‌‌  నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ నిర్మాణం,  ఉన్న నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ నిర్వహణ,  ఆధునికీకరణ  తదితరాలకు కూడా నిరంతరం అదనపు పెట్టుబడులు అవసరమవుతాయి.  విద్యుత్ పంపిణీ సంస్థల ప్రధాన ఆదాయ వనరు విద్యుత్‌‌‌‌ను అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయమే. ఈ ఆదాయం పెరుగుతున్న వ్యయాలను సమకురుస్తుందా అనేదే 

కీలక ప్రశ్న?. 

విద్యుత్‌‌‌‌ చట్టంలో సవరణలు, నిబంధనల్లో మార్పులురోజురోజుకూ  పెరుగుతున్న నష్టాల నుంచి విద్యుత్‌‌‌‌ పంపిణీ సంస్థలను బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌‌‌‌ చట్టంలో సవరణలు తీసుకురావాలని యోచిస్తోంది.  విద్యుత్‌‌‌‌ పంపిణీ రంగంలో  కొనసాగుతున్న ఏకస్వామ్యాన్ని తొలగించి,  ప్రైవేటు పంపిణీ సంస్థలకు కూడా అవకాశం కల్పించడంతోపాటు, ప్రతి సంవత్సరం విద్యుత్‌‌‌‌ టారిఫ్‌‌‌‌లను విద్యుత్‌‌‌‌ నియంత్రణ మండళ్లు సవరించేలా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదిత  సవరణలు అమల్లోకివస్తే దేశ విద్యుత్‌‌‌‌ పంపిణీ విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ మార్పులతో పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతోపాటు, వినియోగదారులపై పడే భారం,  పోటీవల్ల కలిగే ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపైనా సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

విద్యుత్‌‌‌‌ టారిఫ్‌‌‌‌లను  సమయానుకూలంగా సవరించాలి

ఈ పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా విద్యుత్‌‌‌‌ టారిఫ్‌‌‌‌లను  సమయానుకూలంగా సవరించడం లేదా పెరుగుతున్న ఆర్థిక భారానికి తగినంతగా  రాష్ట్ర ప్రభుత్వాలకు  సహకారం అందించడం అవసరం.  అయితే విద్యుత్‌‌‌‌ చార్జీల  సవరణ అంశం క్రమంగా ఆర్థికపరమైన అంశం కంటే రాజకీయ అంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.  వినియోగదారులపై  భారం పడుతుందనే ఆందోళనతో  టారిఫ్‌‌‌‌  సవరణలను వాయిదా వేయడం లేదా పరిమితంగా  ఉంచడం వల్ల  పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిపై  ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.  విద్యుత్‌‌‌‌ చార్జీలను  ప్రజలపై  అనవసర భారం మోపకుండా,  అదే  సమయంలో  విద్యుత్‌‌‌‌ సంస్థల ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా సమతుల్యంగా  నిర్ణయించాల్సిన  అవసరం ఉంది.  లేకపోతే పెరుగుతున్న నిర్వహణ  వ్యయాలు,  వేతనాలు,  నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ విస్తరణకు అవసరమైన పెట్టుబడులు,  విద్యుత్‌‌‌‌ కొనుగోలు వ్యయాల మధ్య ఏర్పడే అంతరం చివరకు పంపిణీ సంస్థల నష్టాలు,  అప్పుల భారాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.

 బైరబోయిన వెంకటేశ్వర్లు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్
అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘం

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.