హైదరాబాద్ లో రాఖీ సందడి.. షాపులు, బస్టాండ్లలో రద్దీ ..కిటకిటలాడుతున్న రాఖీ, స్వీట్ల దుకాణాలు

 హైదరాబాద్ లో రాఖీ సందడి.. షాపులు, బస్టాండ్లలో రద్దీ  ..కిటకిటలాడుతున్న రాఖీ, స్వీట్ల దుకాణాలు
  •  ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులు
  • స్పెషల్ బస్సులు తిప్పుతున్న ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు : రాఖీ పండుగ నేపథ్యంలో షాపులు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రాఖీలు, స్వీట్లు, గిఫ్ట్ ల కొనుగోళ్లతో షాపులు నిండిపోయాయి. మరో వైపు అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు వెళ్తున్న మహిళలతో బస్సులు ఫుల్ అవుతున్నాయి. గురువారం ఉదయం నుంచే రాష్ట్రంలోని బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

 ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం గురువారం నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు, ముఖ్య నగరాలకు, పట్టణాలకు వెళ్లే అన్ని ప్రధాన రూట్లలో స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని, ఈ బస్సులను ఆదివారం వరకు నడపనున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు.

 మహిళల ఫ్రీ స్కీమ్ రెగ్యులర్ బస్సుల్లో మాత్రమే కొనసాగుతుందని, స్పెషల్ బస్సుల్లో ఆ స్కీమ్ వర్తించదని, ఇందులో ఎవరు ప్రయాణించినా 50 శాతం అదనపు ఛార్జీలు ఉంటాయన్నారు. కాగా, స్పెషల్ బస్సులు ప్రారంభించిన మొదటి రోజునే రెగ్యులర్ ప్రయాణికులతో పోలిస్తే సుమారు 60 శాతం మంది అదనంగా ప్రయాణించినట్లు ఆఫీసర్లు తెలిపారు. రాఖీ సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో 5 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.