ఖాట్మండు/హాంగ్‌కాంగ్: నేపాల్‌లో సంభవించిన జలప్రళయానికి భారీ మంచు కొండలు బద్దలవడమే కారణమని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) వెల్లడించింది. అది భూకంపం కాదని.. 5.2 తీవ్రతతో గ్లేసియర్ కూలిపోవడం వల్ల శక్తిమంతమైన భూకంప తరంగాలు సంభవించాయని తెలిపింది. దీనివల్ల మంచు శిథిలాలు నీటి ప్రవాహంతో పాటు కిందికి కొట్టుకువచ్చి భారీ జలప్రళయానికి కారణమయ్యాయని వివరించింది.
సిస్మిక్ స్టేషన్‌ల డేటా, లాంగ్ పీరియడ్ సిస్మిక్ తరంగాలు, శాటిలైట్ ఫొటోల ఆధారంగానే ఈ నిర్ధారణకు వచ్చామని.. అసలు ఎలాంటి భూకంపం సంభవించలేదని యూఎస్‌జీఎస్ స్పష్టం చేసింది. పర్వత ప్రాంతాల నుంచి భారీ పరిమాణంలో ఉన్న మంచు చరియలు విరిగిపడుతున్నట్లు శాటిలైట్ దృశ్యాల ద్వారా తెలిసిందని పేర్కొంది.
ఖాట్మండుకు ఉత్తరంగా సుమారు 66 కిలోమీటర్ల దూరంలో బుధవారం ఉదయం 4.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో వరద ముంచెత్తిందని యూఎస్‌జీఎస్ మొదట వెల్లడించింది. అయితే, తాజాగా దీనిపై తన అంచనాను మార్చుకుని వివరణ ఇచ్చింది. ఖాట్మండు వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రిజన్ భక్తకాయస్థ మాట్లాడుతూ.. లెండే నదిపై మంచు చరియలు విరిగిపడటం వల్ల నదికి అడ్డుకట్ట ఏర్పడిందని తెలిపారు. నీటి నిల్వ పెరగడంతో ఆ కట్ట తెగిపోయి నీరు ఒక్కసారిగా భోటెకోశి నదిలోకి దూసుకొచ్చిందని పేర్కొన్నారు.
వాతావరణ మార్పుల వల్లే భారీ విపత్తు: నిపుణులు
వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోని మంచు, రాళ్లు అస్థిరంగా మారుతున్నాయని న్యూజిలాండ్‌లోని ఎర్త్ సైన్సెస్ 'మౌంటెన్స్ టు సీ' ప్రోగ్రామ్ చీఫ్ సైంటిస్ట్ సైమన్ కాక్స్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఎత్తయిన హిమాలయ పర్వత ప్రాంతాలు తీవ్రంగా వేడెక్కుతున్నాయని తెలిపారు.
దీనివల్ల కొండలపై గట్టిగా ఉండాల్సిన రాళ్లు, మంచు చరియలు బలహీనపడి ఒక్కసారిగా బద్దలవుతున్నాయన్నారు. లాంగ్టంగ్ లిరుంగ్ పర్వత శిఖరం నుంచి భారీ హిమపాతం నదిలోకి పడటమే నేపాల్‌లో ఘోర విపత్తుకు కారణమని వివరించారు. ఇలాంటి ముప్పులు ఇకపై తరచూ జరిగే ప్రమాదముందని హెచ్చరించారు.
