- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపణ
- ప్రైమ్ ల్యాండ్స్‌ను కొల్లగొట్టేందుకే పాలిటెక్నిక్ కాలేజీల విలీనం
- జీవో 97తో విద్యార్థుల భవిష్యత్ అంధకారం
- రేవంత్ సర్కార్‌ది ఎమర్జెన్సీ మైండ్‌సెట్ అని కామెంట్
- రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్తుండగా హౌస్ అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని, విద్యాసంస్థల విలువైన భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు ధారాదత్తం చేసేందుకు కుట్ర పన్నుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా మైండ్‌సెట్‌తో ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తోందని విమర్శించారు. సమస్యలపై గళమెత్తే విద్యార్థులు, ప్రతిపక్షాలపై పోలీసు నిర్బంధాలను ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను పరామర్శించేందుకు బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకుని, హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ జీవో 97 వల్ల తమ భవిష్యత్ అంధకారంలో పడిపోతోందని, కాలేజీకి వచ్చి సమస్యలను పరిశీలించాలని విద్యార్థులు కోరినందునే రామంతాపూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. విద్యార్థులను కలవడానికి వెళ్తుంటే ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించి అడ్డుకోవడం కాంగ్రెస్ పిరికితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
జీవో 97 వెనుక రియల్ ఎస్టేట్ స్కెచ్..
పాలిటెక్నిక్ కాలేజీల్లో అమల్లోకి తెచ్చిన 'శక్తి' స్కీమ్ కాన్సెప్ట్, వివాదాస్పద జీవో 97 వెనుక ప్రభుత్వానికి దుర్మార్గమైన ఎజెండా ఉందని రాంచందర్ రావు ఆరోపించారు. సాంకేతిక విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను ఇంజినీరింగ్‌కు దూరం చేస్తూ, ఈసెట్ రద్దు దిశగా అడుగులు వేస్తున్నారని మండిపడ్డారు. మసాబ్ ట్యాంక్, రామంతాపూర్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు ఉన్న వేల కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్స్‌ను కొల్లగొట్టి, రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టడానికే పాలిటెక్నిక్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం కె.కేశవరావు, కోదండరాంతో కంటితుడుపు కమిటీలను వేయించిందని విమర్శించారు. కాలయాపన చేయకుండా జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నరు..
గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ తోడుదొంగల్లా విద్యావ్యవస్థను నాశనం చేశాయని ఆయన విమర్శించారు. టీచర్లకు జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని దివాలా స్థితికి సర్కార్ చేరిందని, అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రే చేతులెత్తేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో డ్రామాలు ఆడే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తెలంగాణలో జరుగుతున్న విద్యా విధ్వంసంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఆయుష్, మెడికల్ పీజీ విద్యార్థుల స్టైపెండ్లను పక్క రాష్ట్రం కంటే సగానికి తగ్గించి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై పీడీ యాక్టులు పెట్టినా, జైళ్లకు పంపినా, హౌస్ అరెస్టులు చేసినా విద్యార్థుల హక్కుల సాధన కోసం బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాగా, రాంచందర్ రావును ఆయన నివాసంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఇతర నేతలు పరామర్శించారు.
