- విద్యుత్ శాఖ జేఏసీ ప్రతినిధులకు నవీన్ మిట్టల్ హామీ
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను 15 రోజుల్లో ప్రారంభిస్తామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ ప్రతినిధులకు ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ హామీ ఇచ్చారు. రైతు డిస్కమ్ విభజన ప్రక్రియ ముగియగానే బదిలీలు చేపడ్తామన్నారు. విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చిస్తానని తెలిపారు. గురువారం సెక్రటేరియట్‌లో జేఏసీ ప్రతినిధులతో నవీన్ మిట్టల్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై చర్చించారు. ‘‘2026 ఏప్రిల్1నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ కోసం వెంటనే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి, ఉద్యోగులకు న్యాయం చేయాలి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ మార్పు సమస్యను పరిష్కరించాలి. విద్యుత్ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ప్రమోషన్లను వెంటనే చేపట్టాలి. విద్యుత్ రంగంలో క్షేత్రస్థాయిలో కీలక సేవలు అందిస్తున్న ఆర్టిజన్ల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి’’అని జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో చర్చించి సాధ్యమైనంత త్వరగా విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని, ఆర్పీడీసీఎల్ విషయంలో సంఘాలతో ట్రై పార్టీ అగ్రిమెంట్ చేస్తామని నవీన్ మిట్టల్ వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు రమేశ్, అంజయ్య, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
