మణుగూరులో గ్యాంగ్ వార్... ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు

మణుగూరులో గ్యాంగ్ వార్...  ఓ యువకుడు  ప్రాణాలు కోల్పోయాడు

మణుగూరు, వెలుగు : రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గాంధీ బొమ్మ సెంటర్ ఏరియాకు చెందిన సింహాద్రి శివ (28) కార్పెంటర్ గా పనిచేస్తూ కొన్ని రోజుల కింద హైదరాబాద్ లో పనికి వెళ్లాడు. 

అతడి వద్ద పనిచేసే సతీష్ కు ఎంకే (మణుగూరు కాన్దాన్) గ్యాంగ్ మధ్య వివాహం నెలకొంది. సతీశ్ హైదరాబాద్ లో  ఉన్న శివకు ఫోన్ చేసి గొడవ విషయాన్ని చెప్పాడు. దీంతో శివ ఎంకే గ్యాంగ్ లీడర్ రమ్యకాంత్ కు ఫోన్ చేయగా.. ఫోన్ లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శివకు వివాహం నిశ్చయం కావడంతో లగ్నపత్రిక రాసుకునేందుకు బుధవారం మణుగూరుకు వచ్చాడు.

 గురువారం ఉదయం ఎంకే గ్యాంగ్ లీడర్ రమ్యకాంత్ కు ఫోన్ చేసి పాత మణుగూరు సమీపంలోని రాజుపేట గ్రౌండ్ కు రావాలని చెప్పాడు. శివ 15 మందితో కలిసి గ్రౌండ్ కు వెళ్లగా.. రమ్యకాంత్ 25 మందిని తీసుకొని వచ్చాడు. 

ఈ క్రమంలో ఇరు వర్గాలు పరిస్పరం దాడి చేసుకున్నారు. రమ్యకాంత్ గ్యాంగ్ సభ్యులు శివ పై దాడి చేసి గట్టిగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.