బెంగళూరు: ఇండియా గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్.. టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్) నాలుగో సీజన్‌లో అరంగేట్రం చేయనుంది. ఈ టోర్నీలో ఆమె డిఫెండింగ్ చాంపియన్ అల్పైన్ పైపర్స్ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్, అనిష్ గిరి, విదిత్ గుజరాతీ, వోలోడర్ ముర్జిన్ వంటి లెజెండ్ ప్లేయర్లతో కలిసి ఆడనుంది. ఇప్పటి వరకు వ్యక్తిగత టోర్నీలో ఆడిన దివ్య... ఫ్రాంచైజీ ఆధారిత టీమ్ ఫార్మాట్‌లో ర్యాపిడ్ చెస్ సవాలును తొలిసారి ఎదుర్కోనుంది.
కార్ల్‌సన్‌తో కలిసి ఆడటంపై దివ్య సంతోషం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు బెంగళూరులో జరగనున్న ఈ టోర్నీలో ఆరు గ్లోబల్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. మొత్తం 36 మంది టాప్ ప్లేయర్లతో కూడిన మిక్స్‌డ్ టీమ్ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ‘ఇది నా అరంగేట్రం కాబట్టి నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. ఇతర చెస్ టోర్నీలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది. భారీ సంఖ్యలో హాజరుకానున్న ప్రేక్షకుల ముందు ఆడటం చాలా బాగుంటుంది. ఈ ఫార్మాట్ కూడా క్లాసికల్ కంటే భిన్నంగా ఉంటుంది’ అని దివ్య పేర్కొంది.
