- ఆక్సిజన్ పూర్తిగా పడిపోవడమే కారణమంటున్న ఎక్స్పర్ట్స్
- చెరువులపై ఆధారపడిన కుటుంబాలకు తీవ్ర నష్టం
- సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక చెరువులకు మురుగు ముప్పు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని చెరువులకు మురుగు ముప్పు పొంచి ఉంది. పట్టణంలోని ఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీరంతా నేరుగా చెరువుల్లోకి చేరుతుండడంతో నీటి నాణ్యత దెబ్బతింటోంది. చింతకుంట చెరువులో మూడు రోజులుగా వరుసగా చేపలు చనిపోతున్నాయి. ఇప్పటి వరకు రూ.6 లక్షల విలువైన చేపలు చనిపోయినట్లు మత్స్యకారులు చెబుతున్నారు.
మురుగు నీరు చేరడంతో నీటిలో కాలుష్యం పెరిగి ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వల్లే చేపలు చనిపోతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీనిని అరికట్టకపోతే మత్స్యకారుల ఉపాధితో పాటు పర్యావరణంపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
చెరువులే జీవనాధారం
చెరువుల్లో చేపలు పెంచి అమ్ముకోవడమే గంగపుత్రుల ప్రధాన జీవనాధారం. చేప పిల్లలను చెరువుల్లో వదిలి నెలల తరబడి వాటిని పెంచి అమ్ముతుంటారు. ఇందుకోసం పెట్టుబడులు పెట్టడంతో పాటు శ్రమిస్తుంటారు. ప్రస్తుతం చెరువుల్లో చేపలు చనిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత నష్టం జరుగుతుందని అంటున్నారు. అలాగే కలుషిత నీటిలో పెరిగిన చేపలను తినేందుకు వినియోగదారులు ముందుకు రారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉంటే మురుగు నీటితో ఆక్సిజన్ స్థాయి పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో చేపలు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. చింతకుంట చెరువు నీటి నమూనాలు సేకరించి, చేపలు చనిపోవడానికి అసలు కారణాలను తెలుసుకోవాల్సిన
అవసరం ఉంది.
ఏళ్లుగా చెబుతున్నా చర్యలు శూన్యం
చెరువుల్లోకి డ్రైనేజీ నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని గత కొన్నేండ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు గంగపుత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్య తీవ్రత వివరించినా శాశ్వత పరిష్కారం చూపించడం లేదని వాపోతున్నారు.
చేపలు చనిపోయినప్పుడు మురుగు చేరకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోవడం లేదని అంటున్నారు. డ్రైనేజీ నీరు చెరువుల్లోకి ఎక్కడి నుంచి వస్తుందనే విషయాన్ని గుర్తించి, సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. చింతకుంట చెరువులో చేపల మృతికి కారణాలు తెలుసుకొని, డ్రైనేజీ నీరు చెరువులోకి రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు.
నాలుగు చెరువులకు మురుగు ముప్పు
జగిత్యాల జిల్లా కేంద్రం చుట్టూ మోతె చెరువు, కండ్లపల్లి చెరువు, లింగం చెరువు, ముప్పారపు చెరువులు ఉన్నాయి. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరుతోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటుకు గతంలో ప్రతిపాదనలు వచ్చినా కార్యరూపం దాల్చలేదు.
దీంతో చెరువులు మురుగు నీటి నిల్వ కేంద్రాలుగా మారుతున్నాయనే విమర్శలున్నాయి. డ్రైనేజీ నీటితో పాటు ప్లాస్టిక్, చెత్తాచెదారం, చికెన్ వ్యర్థాలు, ఇతర కాలుష్య పదార్థాలు చెరువుల్లోకి చేరుతున్నాయి. దీంతో నీటి నాణ్యత దెబ్బతినడమే కాకుండా దుర్వాసన, దోమల బెడద పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఎస్టీపీ ఎప్పుడు?
మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాతే చెరువులు, ఇతర జల వనరుల్లోకి వెళ్లే సిస్టమ్ ఉండాలి. ఇందుకోసం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)లు కీలకం. అయితే జిల్లా కేంద్రంలో పట్టణ అవసరాలకు అనుగుణంగా సమగ్ర మురుగు నీటి శుద్ధి వ్యవస్థ లేకపోవడం సమస్యగా మారింది. ఇప్పటికైనా చెరువుల్లోకి మురుగు చేరకుండా ప్రత్యేక డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
మరోవైపు చెరువుల చుట్టూ ఆక్రమణలతో మురుగు నీరు వెళ్లే పరిస్థితి లేకుండా పోతోంది. చెరువుల బఫర్ జోన్ పరిధిలోనూ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. చెరువుల విస్తీర్ణాన్ని కాపాడడంతో పాటు ఫీడర్ కాలువలు, నీటి ప్రవాహ మార్గాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది.
