భారతీయ సంస్కృతి వైభవం..రక్షాబంధన్..ఇవాళ(ఆగస్టు28)రాఖీ పౌర్ణమి

భారతీయ సంస్కృతి వైభవం..రక్షాబంధన్..ఇవాళ(ఆగస్టు28)రాఖీ పౌర్ణమి

భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప జీవన సందేశం ఇమిడి ఉంటుంది.  ఆచారాలు, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి.  మనిషి జీవితాన్ని విలువలు, బాధ్యతలు.. మానవీయతతో అనుసంధానించే పవిత్ర సందర్భాలు మన పండుగలు. అలాంటి మహోన్నతమైన పర్వదినాల్లో రక్షాబంధన్ ఒకటి.  శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పర్వదినం అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, విశ్వాసం, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది.  అందుకే దీనిని రాఖీ పౌర్ణమి, నూలుపౌర్ణమి అని కూడా పిలుస్తారు.  రాఖీ అనేది కేవలం చేతికి కట్టే ఒక నూలుదారం కాదు. దాని వెనుక ప్రేమ , ఆత్మీయత పెనవేసుకొని ఉన్న పవిత్ర బంధం దాగి ఉంది. రక్షణకు సంబంధించిన ఒక పవిత్రమైన సంకల్పం కలగల్సి ఉంది. సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కడుతూ అతని క్షేమాన్ని కోరుతుంది. సోదరుడు తన సోదరిని జీవితాంతం గౌరవిస్తూ.. అవసరమైనప్పుడు అండగా నిలబడతాననే భావాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ చిన్న నూలుదారం రెండు మనసులను మాత్రమే కాదు, రెండు కుటుంబాలను, తరతరాల అనుబంధాలను కలుపుతుంది.

అన్నా, చెల్లెళ్లకే కాదు.. సమాజానికి రక్షగా ఉండాలి

‘రక్ష’ అంటే కాపాడటం..బంధన్’ అంటే బంధం. అంటే రక్షాబంధన్ అనేది రక్షణతో కూడిన పవిత్ర బంధం. అయితే ఈ రక్షణ భావనను కేవలం అన్నాచెల్లెళ్ల సంబంధానికే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ మరొకరికి అండగా నిలబడాలి. బలహీనులను కాపాడాలి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి. స్త్రీలకు గౌరవం, భద్రత కల్పించాలి. వృద్ధులకు ఆదరణ ఇవ్వాలి. పిల్లలకు సంరక్షణ అందించాలి. ప్రకృతిని కాపాడాలి. దేశాన్ని ప్రేమించాలి. సమాజ శ్రేయస్సు కోసం మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. ఈ విస్తృతమైన అర్థంలో చూసినప్పుడు రక్షాబంధన్ ఒక కుటుంబ పండుగ మాత్రమే కాదు. సామాజిక బాధ్యతను గుర్తుచేసే స్ఫూర్తిదాయకమైన పర్వదినం.  భారతీయ సంప్రదాయంలో రక్షాబంధనానికి అనేక చారిత్రక, పౌరాణిక, సాంస్కృతిక నేపథ్యాలు ఉన్నాయి.  శ్రీకృష్ణుడు..ద్రౌపది, ఇంద్రుడు..ఇంద్రాణి వంటి కథనాలు రక్షా భావనకు ప్రతీకలుగా తరతరాలుగా చెపుతారు.  ఈ కథనాలన్నింటి అంతరార్థం ఒక్కటే..ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడటం, బంధాన్ని బాధ్యతగా స్వీకరించడం.  రక్షాబంధన్ మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని కూడా గుర్తు చేస్తుంది. రాఖీ పౌర్ణమి మన బంధాలను మరోసారి గుర్తు చేసే పవిత్రమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఒక చిన్న రాఖీ, ఒక ఆత్మీయమైన పలకరింపు, ఒక ఆశీర్వాదం. ఎన్నో సంవత్సరాల జ్ఞాపకాలను మళ్లీ మనసులోకి తీసుకువస్తాయి.

నూలుపౌర్ణమి అనే పేరులోనూ ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక భావం

నూలుపౌర్ణమి అనే పేరులోనూ ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక భావం ఉంది. పవిత్రమైన నూలును రక్షా సంకల్పానికి ప్రతీకగా భావించడం మన సంప్రదాయంలో ఎంతో పురాతనమైనది. ఆ నూలు శరీరానికి మాత్రమే కాదు.. మనసుకు కూడా ఒక బాధ్యతను గుర్తుచేస్తుంది.   నేను ఒంటరిగా లేను..నాకు అండగా నిలిచేవారు ఉన్నారు. అలాగే, అవసరమైనప్పుడు నేను కూడా మరొకరికి అండగా ఉండాలి అనే విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంగా మనం రాఖీ  అర్థాన్ని మరింత విస్తృతంగా స్వీకరించాలి. ప్రతి సోదరి భద్రంగా ఉండే సమాజాన్ని నిర్మించడం, ప్రతి మహిళను గౌరవించడం, ప్రతి బాలికకు విద్య–స్వేచ్ఛ–భద్రత కల్పించడం, కుటుంబాల్లో పరస్పర గౌరవాన్ని పెంపొందించడం మనందరి బాధ్యత.  రక్షాబంధన్ అందించే మరో గొప్ప సందేశం ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా  అందరికీ రక్షాబంధన్  శుభాకాంక్షలు.!

- పగుడాకుల బాలస్వామి
వీహెచ్​పీ, తెలంగాణ

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.