నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్.. 290 మంది భారతీయులు  మిస్సింగ్

నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్.. 290 మంది భారతీయులు  మిస్సింగ్
  • వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మరో 200 మంది 
  •     392కు పెరిగిన మృతులు.. 1,500 మంది ఆచూకీ లేదు
  •     40 హెలికాప్టర్లతో రెస్క్యూ
  •     డీఆర్డీవో మాజీ చీఫ్ సతీశ్ రెడ్డి దంపతులు సహా 31 మంది సేఫ్
  •     80 మంది ఈషా సభ్యుల గల్లంతు.. జగ్గీ వాసుదేవ్ కన్నీరు   
  •     నేపాల్, టిబెట్ బోర్డర్​లో 72 గంటల్లో మరో జలగండం
  •     మరో బ్యారియర్ సరస్సు బద్దలయ్యే ప్రమాదముందన్న చైనా
  •     నేపాల్​కు భారత్ నుంచి 47.5 టన్నుల రిలీఫ్ మెటీరియల్

న్యూఢిల్లీ/ఖాట్మండు: నేపాల్‌‌లో సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత ఇంకా 290 మంది భారతీయుల ఆచూకీ తెలియడంలేదు. వివిధ ప్రాంతాల్లో మరో 200 మంది ఇండియన్లు చిక్కుకుపోయారు. ఆకస్మిక వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 392కు పెరిగింది. గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి ఎనిమిది జిల్లాల నుంచి మరో 93 మృతదేహాలను వెలికితీశారు. ఆకస్మిక వరదల వల్ల దాదాపు 1,500 మంది గల్లంతు కాగా, వారిలో 590 మంది టూరిస్టులు ఉన్నారని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ ‘ఎన్‌‌డీఆర్ఆర్ఎంఏ’ గురువారం వెల్లడించింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపింది. గురువారం రసువాలో చిక్కుకున్న 27 మంది విదేశీ టూరిస్టులను అధికారులు రక్షించారు. వీరిలో 11 మంది భారతీయ పౌరులు ఉన్నారు. నేపాల్‌‌లో గల్లంతు అయిన భారతీయుల ఆచూకీ కనుగొనేందుకు, ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విపత్తు సమయంలో నేపాల్‌‌కు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని ప్రకటించింది.


ఖాట్మండు, బీజింగ్‌‌లోని భారత రాయబారులతోపాటు ఉన్నతాధికారులతో గురువారం రివ్యూ నిర్వహించిన అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మీడియాతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాలలో చిక్కుకున్న ఇండియన్ల పరిస్థితిని తెలుసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలలో చిక్కుకున్న, గల్లంతైన భారతీయులను గుర్తించి, రక్షించడమే తక్షణ ప్రాధాన్యమని చెప్పారు. ఇతర శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లు, ఇతర సంబంధిత అధికారులతో విదేశాంగ శాఖ సమన్వయం చేస్తోందని జైశంకర్ తెలిపారు.

మనోళ్ల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నం: జైస్వాల్ 

నేపాల్‌‌లో గల్లంతైన భారతీయులలో జలవిద్యుత్ ప్రాజెక్టులలో పనిచేస్తున్నవారితో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటక బృందాలు ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌‌ధీర్ జైస్వాల్ చెప్పారు. ‘‘సంప్రదించడానికి వీలుకాని భారతీయ పౌరులు 290 మంది ఉన్నారు. వీరిలో త్రిశూలి వన్ పవర్ ప్రాజెక్ట్‌‌లో పని చేస్తున్న 73 మంది ఉన్నారు. వీరి గురించి మరింత సమాచారం పొందడానికి ఖాట్మండులోని మా రాయబార కార్యాలయం ప్రాజెక్ట్ హెడ్‌‌తో టచ్‌‌లో ఉంది’’ అని ఆయన చెప్పారు. ‘‘అలాగే, సమ్రాట్, ఫ్లై ఎవరెస్ట్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా కైలాస మానస సరోవర యాత్రకు తమిళనాడు నుంచి 37 మందితో ఓ టీమ్, 49 మందితో మరో టీమ్ వెళ్లాయి. సమ్రాట్ ట్రావెల్స్ ద్వారా రసువా జిల్లాలోని తిమురేకు వెళ్లిన పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన 32 మంది బృందం ఉందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 61 మందితో కూడిన మరో బృందం కూడా ఉన్నాయి. కేరళకు చెందిన మరో 33 మంది కూడా నేపాల్‌‌ వెళ్లారు. వీరందరి ఆచూకీ తెలియాల్సి ఉంది” అని జైస్వాల్ వెల్లడించారు. ‘‘తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులను రక్షించాం. మానస సరోవర యాత్రకు వెళ్లిన పలువురు భారతీయ పౌరులు చైనా వైపు చిక్కుకుపోయారనే సమాచారం అందింది” అని చెప్పారు. టిబెట్ వైపు సుమారు 200 మంది భారతీయులు చిక్కుకున్నారని, తమను తరలించాలని వారు కోరారని తెలిపారు. వీరిలో 95 మంది గర్చాన్‌‌లో ఉన్నారని, నేపాల్‌‌లోకి ప్రవేశించేందుకు ముందుకు సాగుతున్నారని, నలుగురు గీలాంగ్ నగరంలో, 13 మంది జుతుల్పూక్‌‌లో ఉన్నారని పేర్కొన్నారు.

డీఆర్‌‌‌‌డీవో మాజీ చీఫ్ ​సతీశ్‌‌ రెడ్డి దంపతులు సేఫ్​  

మానస సరోవర్ యాత్ర కోసం నేపాల్ వెళ్లిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌‌డీఓ) మాజీ చీఫ్​ సతీశ్‌‌రెడ్డి, ఆయన భార్యతో సహా 31 మంది హైదరాబాద్ వాసులు కూడా ఆకస్మిక వరదల వల్ల చిక్కుకుపోయారు.  సతీశ్ రెడ్డి, ఆయన భార్య, తదితరులు ప్రస్తుతం టిబెట్‌‌లోని సాగా కౌంటీలో ఉన్నారు. అయితే, తామంతా సురక్షితంగా ఉన్నామని, బుధవారం వరద ప్రభావిత ప్రాంతాన్ని దాటామని తమ కుటుంబాలకు తెలియజేశారు. వారు ఇప్పుడు టిబెట్--చైనా మార్గం ద్వారా భారతదేశానికి తిరిగి రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే,  చైనా, టిబెట్ సరిహద్దు చైనా నియంత్రణలో ఉంది. ఆ మార్గాన్ని చైనా తిరిగి తెరిచిన వెంటనే సతీశ్ రెడ్డి, తదితరులు భారత్ వచ్చేందుకు మార్గం సుగమం కానుందని అధికారిక వర్గాలు తెలిపాయి. 

30 దేశాలకు చెందిన 476 మంది గల్లంతు 

నేపాల్ టూరిజం బోర్డు వివరాల ప్రకారం.. 476 మంది విదేశీయులు, 114 మంది నేపాలీలతో సహా 590 మంది టూరిస్టులతో సంబంధాలు కట్ అయ్యాయి. విదేశీ టూరిస్టులు భారత్, అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా, యూకే, ఇటలీ, దక్షిణ కొరియాతో సహా 30 దేశాలకు పైగా చెందినవారు ఉన్నారు. భారతీయ టూరిస్టులలో ఎక్కువ మంది టిబెట్‌‌లోని కైలాస మానస సరోవరానికి, నేపాల్‌‌లోని బాగ్మతి ప్రావిన్స్‌‌లోని గోసైన్‌‌కుండకు వెళ్లే మార్గంలో ఉన్నారని అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భద్రతా సిబ్బంది, స్థానిక అధికారులు గల్లంతైన వారి కోసం నదీతీరాలు, దిగువ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అలాగే, వివిధ జలవిద్యుత్, కస్టమ్స్ కార్యాలయాలలో పనిచేస్తున్న సుమారు 160 మంది గల్లంతయ్యారు. కాగా, ‘‘వేలాది కుటుంబాలు ఇళ్లను కోల్పోయాయి. విపత్తు పూర్తి నష్టాన్ని నిర్ధారించడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాం’’ అని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు.

నేపాల్‌‌కు 47.5 టన్నుల సామగ్రి

నేపాల్‌‌కు బుధవారం రాత్రి నుంచి భారత్ రెండు సైనిక రవాణా విమానాలలో మొత్తం 47.5 టన్నుల అత్యవసర సామాగ్రిని పంపింది. బుధవారం 10 టన్నుల హెచ్‌‌ఏడీఆర్ (మానవతా సహాయం, విపత్తు సహాయం) సామగ్రిని పంపగా.. గురువారం మరో సైనిక రవాణా విమానంలో 37.5 టన్నుల సహాయక సామగ్రిని పంపింది. ‘‘నేపాల్ కోసం 37.5 టన్నుల హెచ్‌‌ఏడీఆర్ మెటీరియల్, మందులు, ఆహార ప్యాకెట్లను మోసుకెళ్తున్న రెండో విమానం ఇప్పుడే టేకాఫ్ అయింది” అని జైశంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

కన్నీటిపర్యంతమైన సద్గురు

లాసా: నేపాల్ జలప్రళయంలో తమ ఫౌండేషన్‌‌కు చెందిన 80 మంది సభ్యులు గల్లంతయ్యారని ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రకటించారు. ఆయన టిబెట్‌‌లోని ‘సగా’ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈషా క్యాంప్‌‌లో తన అనుచరులనుద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు. కైలాస యాత్రను ముగించుకుని తిరుగు ప్రయాణమైన తమ ఫౌండేషన్‌‌ సభ్యుల బృందం గ్యిరోంగ్ ఇమిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న టైంలోనే వరద ముంచెత్తిందని సద్గురు తెలిపారు. ఉదయం 9:05 గంటలకు ఇమిగ్రేషన్ కేంద్రానికి చేరుకున్నామని ఆ గ్రూప్ లీడర్ ఇషాంగా ప్రవీణ్ నుంచి తమకు మెసేజ్ అందిందన్నారు. ఆ తర్వాత 9 నిమిషాలకే ఇమిగ్రేషన్ బిల్డింగ్ మొత్తం వరద ఉధృతికి కొట్టుకుపోయిందని కంటతడి పెట్టుకున్నారు. వారం రోజుల క్రితం తాను కూడా అదే ఇమిగ్రేషన్ సెంటర్‌‌లో ఉన్నానని గుర్తుచేసుకున్నారు. ఈ విపత్తు తీవ్రత ఊహించినదాని కంటే చాలా ఎక్కువ ఉండొచ్చని హెచ్చరించారు. మృతుల సంఖ్య 1,500 లేదా ఎక్కువే ఉండవచ్చని తెలిపారు. సద్గురు ప్రకటనతో క్యాంప్ అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి.

సోలార్‌‌ పవర్‌‌ బ్యాంకుల పంపిణీ

భీకర వరదలతో నేపాల్‌‌లోని పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. 12 జలవిద్యుత్‌‌ ప్రాజెక్టులు దెబ్బతిని 431.1 మెగావాట్ల విద్యుత్‌‌ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో చాలామంది బాధితులు కరెంట్ లేక రాత్రిపూట ఇబ్బంది పడుతున్నారు. నేపాల్‌‌ ప్రభుత్వం రసువా, నువాకోట్‌‌, ధాడింగ్‌‌ జిల్లాల్లో ప్రత్యామ్నాయ విద్యుత్‌‌ ఏర్పాట్లు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు సోలార్‌‌ పవర్‌‌ బ్యాంకులను పంపిణీ చేస్తోంది.

రెస్క్యూ పనుల్లో 40 హెలికాప్టర్లు

నేపాల్‌‌లో వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయక సామగ్రి చేరవేసేందుకు ప్రైవేట్ హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. త్రిభువన్ విమానాశ్రయం నుంచి గురువారం 40కుపైగా చార్టర్ హెలికాప్టర్లు ప్రభావిత ప్రాంతాలకు సరుకులను తరలించాయి. ఎయిర్​పోర్ట్​లోని నేపాల్ ఆర్మీ 14వ బెటాలియన్ ఈ కార్యకలాపాలను సమన్వయం చేస్తోంది.