తుమ్మిడిహట్టిపై సెప్టెంబర్ 1న CWC మీటింగ్..మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలకు ఆహ్వానం

తుమ్మిడిహట్టిపై సెప్టెంబర్ 1న CWC మీటింగ్..మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలకు ఆహ్వానం

హైదరాబాద్: వివాదాస్పదంగా మారిన తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘం (CWC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు ఎత్తు,ఇతర అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలను అధికారికంగా చర్చలకు ఆహ్వానించింది.

సెప్టెంబర్ 1న ఢిల్లీలో హైలెవల్ మీటింగ్

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారులతో కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు రూపకల్పన, ఎత్తు, నీటి లభ్యత తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు.

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రాజెక్టు ఎత్తును పెంచాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఆయన ప్రత్యేకంగా లేఖలు రాశారు. రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులు, నిరంతర ప్రయత్నాల ఫలితంగానే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ వాదన ఏమిటి?

ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్లకు అంగీకరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.ఒకవేళ ఎత్తును 148 మీటర్లకు పరిమితం చేస్తే.. గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం రాష్ట్రానికి సాధ్యం కాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.ఒకవేళ అంతకంటే తక్కువ ఎత్తు ఉంటే భారీ పంపులను ఏర్పాటు చేయాల్సి వస్తుందని, దీనివల్ల విద్యుత్ వ్యయం భారీగా పెరుగుతుందని తెలంగాణ వాదిస్తోంది.ప్రాజెక్టు ఎత్తును పెంచినప్పటికీ దాని వల్ల జరిగే ముంపు చాలా తక్కువగానే ఉంటుందని తెలంగాణ అధికారులు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. 

మరి సెప్టెంబర్ 1న జరిగే ఈ కీలక భేటీలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది? ప్రాజెక్టు వివాదానికి తెరపడుతుందా? లేదా అనేది ఉత్కంఠగా మారింది.