జగిత్యాల జిల్లాలో రూ.19 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం

జగిత్యాల జిల్లాలో రూ.19 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం

జగిత్యాల జిల్లాలోని కోడిమ్యాల మండలంలో భారీ ఎత్తున సీఎంఆర్ (Custom Milled Rice) ధాన్యం దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. సుమారు 19 కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాయమైన ఘటనపై అధికారులు తీవ్ర చర్యలు చేపట్టారు.

కోడిమ్యాల మండలం శ్రీరాములపల్లిలోని అమృత ఆగ్రో ఇండస్ట్రీ, హరిహర ఆగ్రో ఇండస్ట్రీ మిల్లుల్లో విజిలెన్స్,సివిల్ సప్లయ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. అమృత ఆగ్రో ఇండస్ట్రీలో 1,893 మెట్రిక్ టన్నుల ధాన్యం , హరిహర ఆగ్రో ఇండస్ట్రీలో  5,323 మెట్రిక్ టన్నుల ధాన్యం కనిపించకుండా పోయినట్లు అధికారులు నిర్ధారించారు.

సివిల్ సప్లయ్ అధికారుల అధికారిక ఫిర్యాదు మేరకు కోడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రైస్ మిల్ యజమానులను నిందితులుగా చేర్చగా, ఈ కేసుకు సంబంధించి గంగాధర్, గోదావరి, వజ్రమ్మ, మారుతి అనే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కీలక ఆధారాలుగా సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను మల్యాల సీఐ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇంకా నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.