- దశాబ్దాలుగా ఇదే జరుగుతున్నది.. పరిస్థితి మెరుగుపడాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఒలింపిక్ క్రీడల్లోని సగం పోటీల్లో కూడా భారత్ పాల్గొనడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దశాబ్దాలుగా జరుగుతూనే ఉందన్నారు. ఇప్పటికైనా పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్ వంటి ఇంతకుముందు ప్రాతినిధ్యం లేని ఈవెంట్లలో కూడా మన క్రీడాకారులు బరిలోకి దిగితేనే దేశం పతకాల సంఖ్య పెరుగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ నెల 29న జరగబోయే జాతీయ క్రీడా దినోత్సవం (నేషనల్ స్పోర్ట్స్ డే) సందర్భంగా గురువారం నిర్వహించిన 'ఖేలో ఇండియా డైలాగ్' వర్చువల్ సమావేశంలో వివిధ ప్రదేశాలలో సమావేశమైన వందలాది మంది అథ్లెట్లు, విద్యార్థులు, వాలంటీర్లను ఉద్దేశించి వర్చువల్‌గా మోదీ మాట్లాడారు.
క్రీడల పట్ల తన దార్శనికత కేవలం పతకాలు గెలవడం మాత్రమే కాదని, దానిని దేశ నిర్మాణ ప్రక్రియలో ఒక అంతర్భాగంగా మార్చడమేనని అన్నారు. ‘2012లో మనం కేవలం 13 క్రీడల్లో మాత్రమే పోటీపడ్డాం. 20కి పైగా ఈవెంట్లలో మనం పాల్గొననే లేదు. అంతేకాదు ఈ పోటీల్లో కొన్నింటి గురించి దేశంలో చాలా మందికి తెలియదు కూడా. ఇతర దేశాలు ఆ క్రీడల్లో పతకాలు గెలుస్తున్నాయి. మనం కనీసం పాల్గొనడం కూడా లేదు. మన పతకాలను పెంచుకోవాలంటే, మనం ఈ క్రీడల్లో మెరుగుపడాలి’ అని ప్రధాని సూచించారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 32 క్రీడాంశాలు ఉండగా.. భారత్ కేవలం 16 క్రీడల్లో మాత్రమే పాల్గొంది. సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్ వంటి వాటిలో ఇప్పటివరకు ఏ భారతీయుడూ పోటీపడలేదు. కాగా, మన దేశంలో విస్తారమైన తీరప్రాంతం, కొండ ప్రాంతాలు ఉన్నందున వాటర్ స్పోర్ట్స్, వింటర్ స్పోర్ట్స్‌లో రాణించడానికి తగిన భౌగోళిక పరిస్థితులు, జనాభా ఉన్నాయని మోదీ గుర్తుచేశారు.
ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం, మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ప్రధాని ఘన నివాళులు అర్పించారు. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ధ్యాన్‌చంద్ న్యూజిలాండ్‌లో పర్యటించారని.. భారత్, -న్యూజిలాండ్ క్రీడా సంబంధాల శతాబ్ది ఉత్సవాలకు అదే పునాది అని కొనియాడారు. కొన్ని రోజుల క్రితం తాను న్యూజిలాండ్ వెళ్లినప్పుడు, ఆయనను గుర్తు చేసుకున్నాని చెప్పారు. ‘స్క్రీన్‌ల కంటే స్పోర్ట్స్ సెంటర్లు ముఖ్యమైనవి. ప్లే స్టేషన్ల కంటే ప్లేగ్రౌండ్లు ముఖ్యం’ అని ప్రధాని యువతకు పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. శీతల్ దేవి, అవని లేఖర, సుమిత్ అంటిల్ వంటి పారా-అథ్లెట్లు తమ అంకితభావంతో దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. గాంధీనగర్‌లోని ఐఐటీ నుంచి కేంద్ర క్రీడామంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
