మహిళలకు... డ్రగ్స్ కంట్రోల్ బాధ్యత.. సంఘమిత్ర పేరుతో వరంగల్ లో వినూత్న ప్రయోగం

మహిళలకు... డ్రగ్స్ కంట్రోల్ బాధ్యత.. సంఘమిత్ర పేరుతో  వరంగల్ లో వినూత్న ప్రయోగం
  •     ఇంటా బయటా నిఘా పెట్టేలా మహిళలకు బాధ్యతలు
  •     ప్రత్యేక చొరవ తీసుకున్న వరంగల్ కమిషనర్‍ శ్వేత
  •     మహిళా సంఘాలతో జనగామలో తొలి సమావేశం

వరంగల్‍, వెలుగు : డ్రగ్స్, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‍ శాఖ పనిచేస్తోంది. ఇందులో భాగంగానే వరంగల్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డ్రగ్స్ కంట్రోలింగ్ బాధ్యతలను మహిళలు, మహిళా సంఘాల సభ్యులకు అప్పగించారు.

 తమ పిల్లలతో పాటు చుట్టుపక్కల నివసించే వారు, మహిళలు పనిచేసే ఏరియాల్లో డ్రగ్స్ వాడకంపై కన్నేసేలా వారికి 'సంఘమిత్ర' బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం వరంగల్ పోలీస్‍ కమిషనర్‍ శ్వేత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 

రాఖీ పండుగ వేళ మహిళలకు బాధ్యతలు

రాష్ట్రంలోని చాలా కుటుంబాల్లో ఇంటి పెద్దలు, సోదరులు, కొడుకులు డ్రగ్స్ బారిన పడుతుండడంతో మహిళలు మానసికంగా, ఆర్థికంగా క్షోభ అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ వల్ల అసలు సిసలు బాధలు తెలిసిన మహిళల చేతికే కంట్రోలింగ్‍ బాధ్యతలు అప్పగించడం వల్ల సత్ఫలితాలు సాధించొచ్చని భావించిన పోలీసులు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమ ప్రారంభానికి రాఖీ పండుగనే ముహూర్తంగా నిర్ణయించారు. 

వివిధ శాఖల్లో ఉద్యోగులు, సహాయకులుగా ఉండే వందలాది మహిళా సంఘాలతో బుధవారం జనగామలో సమావేశం అయ్యారు. పంజాబ్‍, హరియాణా వంటి రాష్ట్రాల యువత డ్రగ్స్ బానిసలుగా మారడంతో ప్రాంత అభివృద్ధిపై ఎలా ప్రభావం పడుతుందో వివరించారు.

లక్షలాది మంది మహిళలు

వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలో సుమారు 26 లక్షల జనాభా ఉండగా.. మూడు వేల మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. శాంతి భద్రతలు కాపాడడం మొదలు వివిధ కేసులు, వీఐపీల సెక్యూరిటీ, బందోబస్తు పనులే వీరికి తలకుమించి భారంగా మారుతున్నాయి. 

అదే.. జనాభాలో సగం ఉండే మహిళలకే 'సంఘమిత్ర' బాధ్యతలు అప్పగించడం ద్వారా డ్రగ్స్ కు అడ్డుకట్ట వేయొచ్చని భావించారు. కమిషనరేట్‍ పరిధిలోని ఒక్క జనగామ జిల్లాలోనే 1.25 లక్షల మంది మహిళలు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 

జనగామతో పోలిస్తే పెద్ద జిల్లాలైన వరంగల్‍, హనుమకొండ జిల్లాలు కలిస్తే దాదాపుగా నాలుగు లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉంటారు. కమిషనరేట్ పరిధిలోని పోలీసుల కంటే వంద రెట్లు ఎక్కువగా ఉన్న మహిళలే మాదకద్రవ్యాల నిర్మూలనకు సరైన పరిష్కారమని ఆలోచించిన ఆఫీసర్లు 'సంఘమిత్ర' నిర్ణయం తీసుకున్నారు. 

అనుమాస్పద సమాచార సేకరణ కోసం...

ఇటు ఇంట్లోనూ, అటు సమాజంలోనూ మహిళల కంట పడని సమాచారం అంటూ ఉండదు. ఈ క్రమంలో గ్రామాలతో పాటు పనిచేసే ప్రాంతాల్లో ఎవరైనా గాంజా, డ్రగ్స్ వంటి వాటి బారిన పడినా, గంజాయి విక్రయాలు, సడన్ గా స్కూల్ మానేసే స్టూడెంట్లు, తల్లిదండ్రుల మాట వినకపోవడం, విభిన్నంగా కనిపించడం, అనుమానాస్పద వ్యక్తులతో తిరగడం వంటి అంశాలను మహిళలు గుర్తించాల్సి ఉంటుంది. 

ఇలాంటి విషయాన్ని గుర్తిస్తే వెంటనే 112 టోల్ ఫ్రీ నంబర్‍ ద్వారా పోలీసులకు చేరవేయాలి. సమాచారం ఇచ్చిన సభ్యుల వివరాలను పోలీసులు బయట ఎక్కడ చెప్పకుండా గోప్యంగా ఉంచనున్నారు. సమాచారం ద్వారా వచ్చిన ఫలితం ఆధారంగా బహుమతులు, అధికారుల నుంచి సర్టిఫికెట్లు సైతం అందించనున్నారు.

మహిళలు తలచుకుంటే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యం 

రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఏ బాధ్యత అప్పజెప్పినా ఇప్పటివరకు ఫెయిల్ కాలేదు. గర్భిణులకు పౌష్టికాహారం అందించే బాధ్యతల నుంచి చిన్నారులకు మధ్యాహ్న భోజనం, అక్షరాస్యత, కుటుంబ సంక్షేమం, సోషల్ ఆడిట్‍ వంటి అనేక కార్యక్రమాలను మహిళలు ముందుండి నడిపించి విజయవంతం చేశారు. 

26 లక్షల జనాభా ఉన్న వరంగల్‍ కమిషనరేట్‍లో మూడు వేల మంది పోలీస్‍ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రగ్స్ కంట్రోల్‍లో ప్రజల భాగస్వామ్యంతోనే మంచి ఫలితాలు వస్తాయి. ఇందులో భాగంగానే అప్పగించే పనులను అత్యుత్తమ బాధ్యతగా తీసుకునే మహిళా సంఘాలపై నమ్మకంతో వారిని 'సంఘమిత్ర'లుగా పోలీస్‍ శాఖతో కలిసి పనిచేసేలా అడుగులు వేస్తున్నాం. 


- ఎన్‍.శ్వేత (వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍)