సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచకుండా, ఉన్న వేతనాలు తగ్గించటం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు పెంచుతున్నామని ప్రకటించి, అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు.
గురువారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో మున్సిపల్ వేతనాలు ఇవ్వడం అన్యాయమన్నారు. 2వ పీఆర్సీని అమలు చేయడంతో పాటు జీహెచ్ఎంసీలో మాదిరిగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలన్నారు. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే, రాష్ట్రంలోని కార్మిక సంఘాలు ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
యూనియన్ అధ్యక్షుడు కె. ఏసురత్నం, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్, కార్యదర్శి బి. వెంకటేశం, వనంపల్లి జైపాల్ రెడ్డి, పి.వెంకటయ్య, బొడ్డుపల్లి కిషన్, కమతం యాదగిరి, ఎండీ ఉస్మాన్, ఎం.మద్దిలేటి, కమలమ్మ పాల్గొన్నారు.
