- యార్డు నుంచి బస్తాలను ఎత్తుకెళ్లిన ముగ్గురు వ్యక్తులు
- చండూరు మార్కెట్ యార్డు గోదాంలో వడ్ల దొంగతనం కేసులో ఆసక్తికర విషయాలు
- వారిని పట్టుకొని, బెదిరించి రూ. 5 లక్షలు తీసుకున్న ముఠా
చండూరు, వెలుగు : 'వడ్లు దొంగతనం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మరో ముఠా సభ్యులు పట్టుకున్నారు.. పోలీసులకు అప్పగిస్తామని బెదిరించారు.. చివరకు రూ.5 లక్షలు వసూలు చేసి గప్ చుప్ అయ్యారు'. నల్గొండ జిల్లా చండూరు మార్కెట్‌యార్డులో జరిగిన వడ్ల దొంగతనం కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వడ్లను దొంగిలించిన ముగ్గురితో పాటు, వారిని బెదిరించిన మరో ఎనిమిది మందిని చండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ రాము గురువారం వెల్లడించారు.
కనగల్ మండలం కురంపల్లి గ్రామంలోని మహావీర్ పార్ బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ సంబంధించిన ప్రభుత్వ వడ్లను చండూర్ మార్కెట్‌యార్డు గోదాంలో నిల్వ చేశారు. మొత్తం 25 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లుకు తరలించగా.. మరో 13 వేల క్వింటాళ్లు గోదాంలోనే ఉన్నాయి. మిల్లు యజమాని తేలుకుంట్ల శ్రీనివాసులు ఇటీవల గోదాంను పరిశీలించగా.. ధాన్యం చిందరవందరగా కనిపించడంతో పాటు బస్తాలు తీసుకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో లెక్కలు తీయగా 600 నుంచి 700 బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. దీంతో ఈ నెల 22న చండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తాళం చెవి దొరకడంతో...
శ్రీనివాసులు ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది. మార్కెట్‌యార్డులో ట్రేడ్ లైసెన్స్ హోల్డర్‌గా ఉన్న నాగిళ్ల ఆంజనేయులు అప్పుడప్పుడు హమాలీగా పనిచేసేవాడు. రెండు నెలల కింద యార్డులోని గోదాం తాళం చెవి అతడికి దొరికింది. దీంతో బొమ్మోజు ప్రకాశ్, మేతరి నాగేశ్ తో కలిసి రాత్రి సమయంలో గోదాంలోని వడ్ల బస్తాలను దొంగిలించి సూర్యాపేట మార్కెట్‌లో అమ్మేవారు.
జులై 18న రాత్రి కూడా వడ్లను బొలెరోలో లోడ్ చేస్తుండగా.. దోటి వెంకన్న, వేముల పవన్, దోటి శివ, భీమనపల్లి గణేష్, దోటి నరేష్, గండూరి మల్లేశ్, బెత వెంకన్న, గోల్కొండ శేఖర్ గమనించి పట్టుకున్నారు. పోలీసులకు అప్పగిస్తామని, చంపేస్తామని బెదిరించి వారి వద్ద నుంచి రూ. 5 లక్షలు తీసుకున్నారు. ఈ క్రమంలో నల్లస్వామి అనే వ్యక్తి వీడియోలు తీసినట్లు పోలీసులు తెలిపారు. వడ్ల చోరీ ఘటనల మొత్తం 11 మందిని అరెస్ట్ చేయగా.. నల్ల స్వామి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ. 9.80 లక్షలు, 11 సెల్ ఫోన్లు, బొలెరో ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు.
